భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..పెడనలో ఇద్దరు బాలికల అదృశ్యం కేసులో ఇద్దరు యువకుల అరెస్ట్ .పోక్సో చట్టం కింద కేసు నమోదు – జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

క్రైమ్ న్యూస్ కృష్ణా :

పెడన మండలంలో ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు తెలిపారు. బాలికల తల్లి ఇచ్చిన ఫిర్యాదులో లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి రావడంతో బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో Crime No.252/2026గా కేసు నమోదు చేసి, BNS-2023లోని సెక్షన్లు 137(2), 65(1), 351(2) R/W 3(5) మరియు POCSO Act-2012లోని సెక్షన్లు 3 & 4 కింద దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…

“ఆగస్టు 6వ తేదీన పెడన మండల పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలికలను ట్రేస్ చేసి, వారు ఎక్కడికి వెళ్లారు, ఎవరితో వెళ్లారు, ఏ వాహనంలో ప్రయాణించారు, తిరిగి ఎలా ఇళ్లకు చేరుకున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు.

ఆగస్టు 7వ తేదీ తెల్లవారుజామున బాలికలు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. అయితే అదే రోజు సాయంత్రం ఒక బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణలు చేశారు. దీంతో ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో Crime No.252/2026గా కేసు నమోదు చేసి, పోక్సో చట్టంలోని సెక్షన్లు 3, 4తో పాటు BNSలోని సంబంధిత సెక్షన్ల కింద దర్యాప్తు కొనసాగిస్తున్నాం.

ఈ కేసులో శ్యామ్ కిరణ్ (20), కోకిలగడ్డ సిద్ధు (20)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్యామ్ కిరణ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై నిందితులను విచారిస్తూ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఆధారాలను సేకరిస్తున్నాం.

నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టాం. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, నిర్ణీత గడువులో చార్జ్‌షీట్ దాఖలు చేస్తాం. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో త్వరితగతిన విచారణకు వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకుంటాం.

దర్యాప్తులో భాగంగా బాలికలు ఒక నిందితుడికి పరిచయం ఉన్న వ్యక్తితో వెళ్లినట్లు గుర్తించాం. అయితే బాలికల భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని వారి పేర్లు, పాఠశాల, హాస్టల్, తల్లిదండ్రుల వివరాలు, నివాస ప్రాంతం లేదా ఇతర గుర్తింపు వివరాలను బహిర్గతం చేయమని చెప్పారు.

అలాగే బాలికలు సంబంధిత ప్రాంగణం నుంచి ఎలా బయటకు వచ్చారు, అక్కడ భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా, ఎవరి నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం వల్ల ఈ ఘటనకు అవకాశం ఏర్పడింది అనే అంశాలపై కూడా ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం ఉన్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం.

అరెస్టైన నిందితుల గత నేరచరిత్ర, గతంలో ఏమైనా కేసులు నమోదయ్యాయా, బైండ్‌ఓవర్లు ఉన్నాయా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నాం.

ఈ కేసులో బాలికల గౌరవం, భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. పోక్సో చట్ట నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నాం. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసి, న్యాయస్థానంలో బలమైన చార్జ్‌షీట్ దాఖలు చేస్తాం
అని ఎస్పీ గారు తెలిపారు.