భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్.

(భారత్ డిజిటల్ న్యూస్)- తిరుమల శ్రీవారి సేవా టికెట్లు, టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి భక్తులను మోసం.

  • మొత్తం రూ..10 లక్షల మేర మోసం చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి.
  • టీటీడీ పేష్కార్‌గా పనిచేస్తున్నానని చెప్పి భక్తులను నమ్మించి మోసాలకు పాల్పడిన నిందితుడు.
  • నిందితుడికి 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన గౌరవ న్యాయస్థానం.

తిరుపతి ఆగష్టు 11:
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను మోసం చేసే దళారులు, నకిలీ వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడుతున్న క్రమంలో, భక్తులను మోసం చేసిన కేసులో సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగిని తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన నిందితుడిని తిరుపతి కోలా స్ట్రీట్‌కు చెందిన జలకర గిరిధర్ (34)గా గుర్తించారు. ఇతను టీటీడీ కార్యాలయంలో సబార్డినేట్ (క్లాస్–4) ఉద్యోగిగా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు.

నిందితుడు తాను టీటీడీలో పేష్కార్‌గా పనిచేస్తున్నానని, తన పలుకుబడితో శ్రీవారి సేవా టికెట్లు ఇప్పించగలనని భక్తులను నమ్మించేవాడు. భక్తులకు నమ్మకం కలిగించేందుకు తన టీటీడీ గుర్తింపు కార్డు ప్రతిని కూడా పంపేవాడు.

ఈ క్రమంలో ఈతముక్కల సుబ్రహ్మణ్యం నాయుడు అనే భక్తుడిని నమ్మించి, నిందితుడి ఫోన్‌పే నంబర్‌కు పలు విడతల్లో రూ.1,56,000/- నగదు బదిలీ చేయించుకున్నాడు. 24-05-2026న టికెట్ల కోసం భక్తులు తిరుమల ఎస్‌ఎంసీ ప్రాంతానికి చేరుకున్న సమయంలో నిందితుడు తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుమల II టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో, శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి భక్తుల నుంచి నగదు తీసుకోవడంతో పాటు, తిరుపతికి చెందిన మరో వ్యక్తికి టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3,60,000/- తీసుకుని మోసం చేసినట్లు కూడా నిందితుడు వెల్లడించాడు.

దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నిందితుడు వివిధ సందర్భాల్లో మొత్తం సుమారు రూ.10,00,000/- మేర మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసాలకు సంబంధించి నమోదైన కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది.

నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కేసు వివరాలు మరియు నిందితుడి నేర చరిత్రను పరిశీలించిన గౌరవ న్యాయస్థానం 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

  • శ్రీవారి భక్తులకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి.

ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ, తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు దళారులు, నకిలీ వ్యక్తుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరికైనా డబ్బులు చెల్లించే ముందు వారి వివరాలను పూర్తిగా నిర్ధారించుకోవాలని తెలిపారు.

శ్రీవారి దర్శనం, సేవలు, వసతి తదితర సేవలకు సంబంధించిన టికెట్లు, బుకింగ్‌లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్‌ల ద్వారా మాత్రమే పొందాలని, వ్యక్తిగతంగా డబ్బులు చెల్లించి దళారుల ద్వారా టికెట్లు పొందే ప్రయత్నం చేయవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

భక్తులను మోసం చేసే వ్యక్తులు, దళారుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ఇటువంటి మోసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. గారు స్పష్టం చేశారు.