భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.సమాజ అభ్యున్నతిలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి.
సమాజ అభ్యున్నతిలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్ విక్కుర్తి వెంకట శ్రీనివాస్ అన్నారు.
అవనిగడ్డ లోని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం దివి యూనిట్ భవనంలో శనివారం సంఘ అధ్యక్షులు భూపతి భాస్కరరావు అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్కుర్తి శ్రీనివాస్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొల్లూరు కృష్ణమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కొల్లూరు శ్రీనివాసరావు 42వేల రూపాయలపైగా విలువ కలిగిన మైక్ సెట్ ను సంఘ భవనానికి అందజేశారు.
ఈ సందర్భంగా విక్కుర్తి మాట్లాడుతూ…. చిన్న కుటుంబంలో జన్మించిన సర్వేపల్లి రాధాకృష్ణ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ అంచలంచలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన తీరు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దివిసీమ ఉపాధ్యాయులను తయారు చేసే పరిశ్రమ అని కొనియాడారు.ఎంతోమంది ఉపాధ్యాయులను తయారు చేసిన ఘనత అవనిగడ్డకు చెందుతుందని అన్నారు. ఎంతోమందిని డాక్టర్లు,ఇంజనీర్లు మరి ఎంతోమంది ఉన్నత స్థాయి అధికారులను తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులకు చెందుతుందన్నారు. తల్లిదండ్రుల తరువాత పిల్లలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనన్నారు.
అనంతరం జిల్లా కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన మోర్ల వెంకటేశ్వర్లు, మైక్ దాత కొల్లూరు శ్రీనివాసరావు, ఇటీవల రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు తుంగల చంద్రశేఖర్, సనకా బాభృవాహనరావు లతో పాటు అతిథిగా పాల్గొన్న విక్కుర్తిని సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో భవన నిర్మాణ శాశ్వత కమిటీ గౌరవ అధ్యక్షులు కాశీభోట్ల నాగేశ్వరరావు, సంఘ కార్యదర్శి బొప్పన విశ్వేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్లమూడి సాగరరావు, ట్రెజరర్ బడే దానారావు లతో పాటు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
