భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రైతులు ఫసల్ బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కొత్తపల్లి, ఆగస్టు 18:
కొత్తపల్లి, ఘంటసాలపాలెం గ్రామాల్లో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి డి. అనూష రైతులకు పలు సూచనలు చేశారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి పంటకు సంబంధించిన ఫసల్ బీమా నమోదు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు ఆమె తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో పంటలకు బీమా మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంటూ, రైతులు ఎకరాకు రూ.830 ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలని సూచించారు.
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సమయానికి కురవక ప్రధాన పంట సాగు సాధ్యం కాకపోయినా, పొలాల్లో పీఎండీఎస్ పద్ధతిలో విత్తన గుళికల రూపంలో విత్తుకోవచ్చని వివరించారు. పీఎండీఎస్ పద్ధతిలో సాగు చేయడం వల్ల పొలాల్లో పచ్చదనం కొనసాగడంతో పాటు భూమిలో తేమ, జీవవైవిధ్యం పరిరక్షించబడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ పీఎండీఎస్ కిట్లలో 11 రకాల జాతులకు చెందిన 34 రకాల విత్తనాలను కలిపి అందిస్తున్నట్లు వివరించారు.
