సామాన్య ప్రజా సమస్యల పట్ల సహానుభూతితో స్పందిస్తే తక్షణమే పరిష్కారం సాధ్యం – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..సామాన్య ప్రజా సమస్యల పట్ల సహానుభూతితో స్పందిస్తే తక్షణమే పరిష్కారం సాధ్యం – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.

‘మీకోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి 56 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

క్రైమ్ న్యూస్ కృష్ణా :

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ (మీకోసం) కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యతతో, ఎలాంటి రాజీ లేకుండా చట్టపరిధిలో విచారించి పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్. తెలిపారు.

ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమంలో ఎస్పీ గారు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకొని వారితో ముఖాముఖి మాట్లాడి చట్ట పరిధిలో పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.

సమస్యలతో వచ్చిన ప్రతి ఫిర్యాదుదారునితో చిరునవ్వుతో, మర్యాదపూర్వకంగా మాట్లాడి, వారి బాధలను అర్థం చేసుకుంటూ స్పందిస్తే, వారి సమస్య సగం పరిష్కారమైన భావన కలుగుతుందని అన్నారు. ప్రతి ఫిర్యాదుదారులో న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించడం పోలీసుల బాధ్యత అని సూచించారు.

ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ గారు, ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో సమగ్రంగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించి చట్టబద్ధమైన పరిష్కారం పొందవచ్చని భరోసా కల్పించారు.

ఈరోజు మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి మొత్తం 56 ఫిర్యాదులు అందాయి. వాటిలో ముఖ్యమైనవి

🔹 పామర్రు: శ్రీను అనే వ్యక్తి తన పితరుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని బంధువులు నకిలీ పత్రాలు చూపించి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రశ్నించినందుకు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.

🔹 చల్లపల్లి: లక్ష్మి అనే మహిళకు వివాహం జరిగి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ అదనపు కట్నం కోసం అత్తింటి వారు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని న్యాయం చేయాలని కోరారు.

🔹 కంకిపాడు: బసవయ్య అనే రైతు తన వ్యవసాయ భూమికి వెళ్లే మార్గాన్ని సరిహద్దు భూమి యజమాని అడ్డుకుంటూ, ప్రశ్నించినందుకు దుర్భాషలాడి శారీరక దాడికి పాల్పడుతున్నాడని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.

🔹ఘంటసాల: నరేష్ అనే వ్యక్తి వచ్చి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా తన స్నేహితుడు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ బలికి తన వద్ద నుండి మూడు లక్షల రూపాయిలు తీసుకున్నాడని సంవత్సరమైనప్పటికీ ఉద్యోగం గూర్చి ఎటువంటి సమాచారం లేకపోగా అడుగుతుంటే బెదిరిస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.

అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించి, చట్టపరంగా సత్వర విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.