భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఆధారాలు లేకుండా నాపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోండి.. లేకపోతే పరువు నష్టం దావా తప్పదు” – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
కృష్ణబాబు కాలనీ ఘటనను రాజకీయ లబ్ధి కోసం అంబటి రాంబాబు వక్రీకరిస్తున్నారు
అంబటి రాంబాబు విలేకర్ల సమావేశం, తన పై ప్రత్యేక వీడియో ద్వారా అసత్య ప్రచారం
మహిళ అనుభవించిన క్షోభను నీచ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు
అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కృష్ణబాబు కాలనీలో ఇటీవల ఓ మహిళపై జరిగిన దారుణ ఘటనను రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తూ తనపై నిరాధార ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరించారు.
సోమవారం క్యాంప్ కార్యాలయంలో గళ్ళా మాధవి మాట్లాడుతూ…
గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన ఘటనను రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఖండించారని, మహిళా కమిషన్ సహా సంబంధిత శాఖలు స్పందించి చర్యలు తీసుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఘటనకు బాధ్యులైన వ్యక్తులు చట్టపరమైన శిక్షను ఎదుర్కొంటున్నారని చెప్పారు.

అయితే జరిగిన ఘటనను వక్రీకరిస్తూ కొందరు వైసీపీ నాయకులు కొత్త కథనాలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేకంగా విలేకర్ల సమావేశం నిర్వహించి, అనంతరం ఒక ప్రత్యేక వీడియో రూపొందించి విడుదల చేయడం ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా అంబటి రాంబాబు ప్రత్యక్ష సాక్షిలా వ్యవహరిస్తూ, ఎమ్మెల్యే జోక్యం, పోలీసుల వ్యవహారం, ఘటన వెనుక జరిగిన పరిణామాల పై కల్పిత కథనాలు అల్లుతూ వీడియో విడుదల చేయడం బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడికి తగదన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగుతోందని విమర్శించారు.
మహిళలపై జరిగిన అనేక దారుణ ఘటనల సమయంలో వైసీపీ నాయకులు ఎలా స్పందించారో ప్రజలు మర్చిపోలేదన్నారు. తమ హయాంలో జరిగిన మహిళలపై దాడులు, అవమానాలపై స్పందించని వారు, ఇప్పుడు ఒక మహిళ అనుభవించిన బాధను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరమన్నారు.
ఒక మహిళ న్యాయం కోసం తమ పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంటనే స్పందించి అధికారులను ఆదేశించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. 16వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదైందని, నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించినప్పటికీ ఆలస్యం జరగడంపై తామే బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశామని గుర్తు చేశారు.
ఈ ఘటనలో రాజకీయ పార్టీలు, కులాలు, మతాలకు సంబంధం లేదని, ఒక మహిళకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. కానీ అంబటి రాంబాబు మాత్రం విలేకర్ల సమావేశాలు, ప్రత్యేక వీడియోలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం కొత్త కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఘటన జరిగిన రోజే స్పందించకుండా రెండు రోజుల తర్వాత పరామర్శ పేరుతో వెళ్లి రాజకీయ ప్రచారం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో అంబటి రాంబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా బాధితురాలి పై చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించాల్సిందని, ఆలస్యంగా వెళ్లి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం తీవ్రమైన పరువు నష్టం కలిగించే చర్య అని, విలేకర్ల సమావేశం మరియు ప్రత్యేక వీడియోలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా అంబటి రాంబాబు పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గళ్ళా మాధవి స్పష్టం చేశారు. తాను ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు మాట్లాడిన ప్రతి మాటకు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని, మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నామని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఒక మహిళా ఎమ్మెల్యే పై నిరాధార ఆరోపణలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
రాజకీయంగా విమర్శలు చేయాలంటే అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, విధానాలపై మాట్లాడాలని, కానీ మహిళ అనుభవించిన క్షోభను రాజకీయాలకు వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేకుంటే పరువు నష్టం దావాతో పాటు చట్టపరమైన పోరాటం చేస్తానని హెచ్చరించారు.
“ఆధారాలు లేని నిందలను సహించే పరిస్థితి లేదు. విలేకర్ల సమావేశాలు, వీడియోల ద్వారా అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలి. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. లేదంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.
