భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..: పోలీసుల ఆత్మరక్షణ కోసం నిందితుడిపై కాల్పులు
కంకిపాడు మండలం, కోమటిగుంట సమీపంలో పోలీసుల ఆత్మరక్షణ కోసం నిందితుడిపై కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. పోలీసులపై దాడి చేసి పరారైన నిందితుడిని కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నల్లజర్ల సమీపంలోని దేవరపల్లి ప్రాంతంలో పోలీసులను గాయపరిచి పరారైన అఖిదాసరి అవినాష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు కంకిపాడు మండలం కోమటిగుంట లాకుల డొంక రోడ్డు వద్ద నిందితుడు ఉన్నట్లు గుర్తించారు.
దీంతో కంకిపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే నిందితుడు కత్తి, రాళ్లతో పోలీసులపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిపై దాడి చేసినట్లు సమాచారం.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల ఆత్మరక్షణలో భాగంగా కంకిపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి రెండు కాళ్లకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన నిందితుడు అవినాష్‌ను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య బృందం అతనికి చికిత్స అందిస్తోంది.
ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Search on web
