భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణా జిల్లా పోలీస్
హత్యాయత్నం కేసులో ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష – రూ.1,000/- జరిమానా
క్షణికావేశంలో చేసిన నేరం జీవితాన్ని జైలుపాలు చేస్తుంది – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,
కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కులనెక్కలం గ్రామంలో 2020 సంవత్సరంలో స్థల వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో తన బాబాయిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ముద్దాయికి గౌరవ మహిళా సెషన్స్ కోర్టు, విజయవాడ 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1,000/- జరిమానా విధించింది.
కేసరపల్లి గ్రామానికి చెందిన ఈర్ల వీరాంజనేయులుకు తన బాబాయితో స్థల వివాదం ఉండేది. ఈ నేపథ్యంలో జక్కులనెక్కలం గ్రామంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన వీరాంజనేయులు తన బాబాయిపై కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనపై గన్నవరం పోలీసులు Cr.No.444/2020 U/s 307, 447 IPC కింద హత్యాయత్నం కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు అనంతరం నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు. కేసులో జరిగిన వాదోపవాదాలను పరిశీలించిన గౌరవ మహిళా సెషన్స్ న్యాయస్థానం ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.1,000/- జరిమానా విధించింది.
ఈ కేసులో పోలీసుల తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి ఎం. జ్ఞానాంబిక గారిని అదేవిధంగా కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది మరియు కేసు కోర్టు వరకు సక్రమంగా కొనసాగించడంలో సహకరించిన CMS సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజలకు జిల్లా పోలీసుల విజ్ఞప్తి
క్షణికావేశంలో తీసుకునే ఒక్క నిర్ణయం జీవితాంతం బాధపడేలా చేస్తుంది. చిన్న చిన్న వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు హింసకు దారితీయకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి.
ఆవేశంలో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, నేరం రుజువైన పక్షంలో జైలు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. దీంతో నిందితుడి జీవితం మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అందువల్ల వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
