భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రూ.3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయి పట్టివేత

అనకాపల్లి రూరల్ పోలీసుల మెరుపుదాడి.. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్

Ammiraju Udaya Shankar.sharma News Editor…అనకాపల్లి, సెప్టెంబర్ 3: అనకాపల్లి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీసులు చేపడుతున్న విస్తృత తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి అనకాపల్లి మీదుగా తుని వైపు తరలిస్తున్న 600 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన వ్యాన్‌తో పాటు పైలట్‌గా వ్యవహరిస్తున్న హోండా సివిక్ కారును స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గురువారం మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

జైలు పరిచయంతో గంజాయి రవాణా

పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజీగూడెంకు చెందిన షేక్ మస్తాన్ వలి (A-1) గతంలో గంజాయి కేసులో విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో నర్సీపట్నానికి చెందిన A-3తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ద్వారా భారీ స్థాయిలో గంజాయి రవాణాకు ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.

ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పరిధిలోని దగుడుపల్లికి చెందిన A-2 నుంచి 600 కిలోల గంజాయిని సేకరించి, తుని సమీపంలో అప్పగిస్తే సరుకు ధరకు అదనంగా రూ.3 లక్షల కమీషన్ చెల్లించేలా A-3 ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

చెక్‌పోస్టులు తప్పించుకునేందుకు పక్కా ప్లాన్

పోలీసుల తనిఖీలను తప్పించుకునేందుకు గంజాయిని ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి నడక ద్వారా, మోటార్‌సైకిళ్లపై దఫదఫాలుగా తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. అనంతరం గంజాయిని AP39 VA 6786 నంబర్ గల వ్యాన్‌లో లోడ్ చేశారు.

ఈ వ్యాన్‌కు ముందుగా AP16 BC 0018 నంబర్ గల హోండా సివిక్ కారును పైలట్ వాహనంగా ఏర్పాటు చేసి తుని వైపు తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

సంపతిపురం జంక్షన్ వద్ద పట్టివేత

పక్కా సమాచారంతో అనకాపల్లి రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. రూరల్ ఎస్సై జి. రవికుమార్ ఆధ్వర్యంలోని సిబ్బంది అనకాపల్లి మండలం సంపతిపురం జంక్షన్ వద్ద మాటువేసి గంజాయి లోడుతో వెళ్తున్న వ్యాన్‌ను, దాని ముందు వెళ్తున్న పైలట్ కారును అడ్డుకున్నారు.

వాహనాలను తనిఖీ చేయగా భారీగా గంజాయి బయటపడటంతో స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు అరెస్ట్.. ముగ్గురు పరారీ

ఈ కేసులో

  • షేక్ మస్తాన్ వలి (A-1) – ధర్మాజీగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
  • షేక్ మదీనా (A-4)
  • పాంగి రత్నాలు (A-6) – అల్లూరి సీతారామరాజు జిల్లా

లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక A-2 (ఒడిశా), A-3 (నర్సీపట్నం), A-5 (అల్లూరి సీతారామరాజు జిల్లా) పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

నిందితులపై గతంలోనూ గంజాయి కేసులు

అరెస్టయిన, పరారీలో ఉన్న నిందితుల్లో కొందరిపై గతంలోనూ గంజాయి కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

A-1 షేక్ మస్తాన్ వలిపై జి.మాడుగుల, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి.

A-3పై గొలుగొండ, మార్టూరు, కిర్లంపూడి, జగ్గంపేట, టంగుటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఐదు గంజాయి కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇతనిపై PIT-NDPS చట్టం కింద నిర్బంధ చర్యలు (PD Act) తీసుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.

A-6 పాంగి రత్నాలుపై జి.మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదై ఉందని పోలీసులు తెలిపారు.

పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు

భారీ గంజాయి రవాణా ముఠాను పట్టుకోవడంలో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.

ఎస్‌బీ సీఐ ఎస్. బాల సూర్యరావు, అనకాపల్లి టౌన్ సీఐ జి. ప్రేమకుమార్, రూరల్ సీఐ జి. అశోక్‌కుమార్, రూరల్ ఎస్సై జి. రవికుమార్, టౌన్ ఎస్సై షేక్ జిలాని, ఈగల్ టీం సీఐలు టి. ధనుంజయ నాయుడు, వి. నాగరాజుతో పాటు వారి సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ హెచ్చరించారు. అక్రమ మత్తు పదార్థాల వ్యాపారానికి పాల్పడే వారిపై PIT-NDPS, PD Act వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ. శ్రీనివాసులుతో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.