ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 38 వినతులు
*కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి (భారత్ న్యూస్) నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కు 38 వినతులను వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ప్రజల నుండి వచ్చిన వినతులు ఆయా విభాగాల అధికారులు వెంటనే పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లు అనిల్ కుమార్, నరసింహ ఆచారి కోరారు. మాస్టర్ ప్లాన్ రోడ్లకు తమ స్థలం ఇచ్చామని టి.డి.ఆర్. బాండ్లు ఇప్పించాలని, డ్రెయినేజీ కాలువల్లో మురుగు తొలగించాలని, రవీంద్ర నగర్ లో డ్రెయినేజీ కాలువలు, తెలుగు గంగ నీరు సరఫరా చేయాలని, కోరమేనుగుంట లోని తమ ఇంటి వద్ద వర్షపు నీరు ఆగిపోతున్నదని పరిష్కారం చూపాలని, హరేరామ హరేకృష్ణ మార్గంలో కొంత మంది తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయడంతో తమకు వ్యాపారం జరగడం లేదని టిటిడి దుకాణదారులు, శ్రీనివాస సేతు నిర్మాణం వలన తమ దుకాణం వద్ద నీరు నిలిచి పోతున్నదని , నీటి పన్ను ఎక్కువగా వస్తోందని పరిష్కరించాలని నారాయణపురం కు చెందిన నగేష్ కోరారు. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ ఆయా విభాగాల అధికారులకు అర్జీలను కేటాయించారు. అన్ని అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, థులసికుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, డి.సి.పి. మహాపతి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డి . ఈ.లు, ఏ.సి.పి.లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.
