భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..మహిళల భద్రతకు మరో ముందడుగు – తిరుపతిలో అధునాతన మహిళా పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం.
ప్రారంభించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు.
- మహిళల భద్రత, రక్షణకు ఎన్డీయే ప్రభుత్వ అత్యధిక ప్రాధాన్యత.
- ₹2.70 కోట్ల వ్యయంతో 8,480 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన మహిళా పోలీస్ స్టేషన్.
- బాధిత మహిళల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రం, చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్.
- చిన్నారులతో వచ్చే మహిళలకు ప్రత్యేక వసతులు.
- వారానికి రెండు రోజుల పాటు సైకియాట్రిస్ట్ సేవలు.
- మహిళా పోలీస్ సిబ్బందికి ఆధునిక విధి నిర్వహణ వసతులు.
- తిరుపతి జిల్లాలో మహిళలపై నేరాలు 94 నుంచి 58కి తగ్గుదల.
- కుటుంబ సమస్యలను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత.
తిరుపతి ఆగష్టు 24: మహిళల భద్రత, రక్షణకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన అధునాతన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గార్లు సోమవారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించిన అనంతరం స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమం తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., గారు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ.. మహిళల భద్రత, రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళా బాధితులకు తక్షణ పోలీస్ సేవలు, న్యాయం అందించడంతో పాటు వారికి ధైర్యం, భరోసా కల్పించేలా మహిళా పోలీస్ స్టేషన్లను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
మహిళలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలను తెలియజేయవచ్చని, వారి సమస్యలను సున్నితంగా స్వీకరించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్ ద్వారా కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు.
సుమారు ₹2.70 కోట్ల వ్యయంతో 8,480 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మోడల్ మహిళా పోలీస్ స్టేషన్ను నిర్మించారు. మహిళా బాధితులకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడంతో పాటు పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అవసరమైన ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.
కౌన్సెలింగ్ కేంద్రం.. కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి, కుటుంబ, దాంపత్య మరియు సామాజిక సమస్యలను వీలైనంత వరకు కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి వారానికి రెండు రోజుల పాటు సైకియాట్రిస్ట్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.
మహిళా పోలీస్ స్టేషన్ కేవలం ఫిర్యాదులు స్వీకరించడం, కేసులు నమోదు చేయడం మాత్రమే కాకుండా కుటుంబాల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు కూడా దోహదపడేలా పనిచేయాలనే లక్ష్యంతో ఈ సదుపాయాలను ఏర్పాటు చేశారు.
ఫిర్యాదుల కోసం మహిళలు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చే చిన్నారుల కోసం ప్రత్యేకంగా చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలతో వచ్చే మహిళలకు కూడా అవసరమైన ప్రత్యేక వసతులను కల్పించారు.
అదేవిధంగా కుటుంబ సంబంధాలు, పెద్దలను గౌరవించడం, చిన్నారుల పెంపకం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే సమాచార బోర్డులను ఏర్పాటు చేశారు.
మహిళలపై జరిగే సైబర్ నేరాలు, ఆన్లైన్ వేధింపులు మరియు ఇతర డిజిటల్ నేరాలపై వేగంగా స్పందించేందుకు 24/7 సైబర్ సహాయ కేంద్రంను అందుబాటులోకి తీసుకువచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మహిళలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు.
