పాకాల మండలం: దళితవాడలో రాత్రి తెగిపడిన విద్యుత్ తీగలు – తక్షణమే స్పందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి

భారత్ డిజిటల్ న్యూస్ (20/08/2026) తిరుపతి జిల్లా పాకాల (మద్దినాయనపల్లి):
పాకాల మండలం, మద్దినాయనపల్లి దళిత గ్రామంలో బుధవారం రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. తెగిపడిన వైర్లు నేరుగా నివాస గృహాల పైన పడటంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా అపశ్రుతి సంభవించకపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ, పాతబడిపోయిన ఈ విద్యుత్ లైన్ల వల్ల భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, పాతబడిన విద్యుత్ లైన్లను తొలగించి నూతన లైన్లను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని మద్దినాయనపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.