భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆటో కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమ్మెతో కాకుండా చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. విధివిధానాలు రూపొందించి బోర్డు ఏర్పాటు చేస్తామని, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే రెట్రోఫిట్మెంట్కు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు సాయం అందించే పథకం తీసుకొస్తున్నట్లు తెలిపారు. పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసేవారికీ సహకారం అందిస్తామని చెప్పారు. 2015 తర్వాత ఆటో చార్జీలు పెరగలేదని, చార్జీల పెంపుపై ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత వర్గాలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
