భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.బలపడుతున్న ‘ఎల్‌ నినో’:

👉ముంచుకొస్తున్న ముప్పు!

👉వర్షాలు తగ్గి, పెరగనున్న ఎండ తీవ్రత

👉ఫిబ్రవరి 2027 వరకూ ప్రభావం ఉండే ఛాన్స్: WMO హెచ్చరిక

👉 గోధుమ దిగుబడులపై తీవ్ర ఆందోళన

న్యూఢిల్లీ :

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్రరూపం దాల్చనున్నాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్‌ నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మానవాళిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. ఈ పరిస్థితులు ఫిబ్రవరి 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. భారత్‌లో వర్షాలు తగ్గి ఎండ తీవ్రత ఊహించని రీతిలో పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పడిపోతున్న వర్షపాతం.. పెరుగుతున్న సెగ
సాధారణంగా ఎల్‌ నినో ప్రభావం ఉన్న సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడటం ఆనవాయితీగా వస్తోంది. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 16 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా 1901 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సెప్టెంబరులోనూ సాధారణ సగటులో 91 శాతం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
రబీపై తీవ్ర ప్రభావం
వర్షాకాలమే కాకుండా శీతాకాలంపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో చలికాలపు రోజుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని ‘క్లైమేట్‌ ట్రెండ్స్‌’ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఉత్తర భారతంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. పంట చేతికొచ్చే దశలో వీచే వేడిగాలుల వల్ల రబీలో కీలకమైన గోధుమ దిగుబడి భారీగా పడిపోయే ముప్పు పొంచివుంది. ఇది దేశ ఆహార భద్రతపై ప్రభావం చూపే అవకాశముంది.
ముందస్తు చర్యలు తప్పనిసరి
ఎల్‌ నినో దీర్ఘకాలం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో రైతాంగం, ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి నిల్వల సమర్థ నిర్వహణ, వేడిని తట్టుకునే విత్తనాల వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు…