భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..మైలవరంలో రెండు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ప్రారంభం.

A RAJASEKAR.SR Correspondent Vijayawadaప్రజలకు మరింత చేరువలో మెరుగైన వైద్య సేవలు.
–ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, సెప్టెంబర్ 01, 2026:
మైలవరం పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ఒక్కో కేంద్రానికి రూ.36 లక్షల చొప్పున, మొత్తం 15వ ఆర్థికసంఘం నిధులు రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాలను మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు మంగళవారం ప్రారంభించారు.
మైలవరం పట్టణంలోని దేవుడి చెరువు సమీపంలో సూరిబాబు గారి పార్కు పక్కన రూ.36 లక్షలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం, అలాగే 6వ వార్డులో పాత మసీదు పక్కన రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన మరో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రాథమిక వైద్య సేవలు వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ప్రాథమిక స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటే ప్రజలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ వైద్య సేవలు, ప్రాథమిక చికిత్సలు, తల్లి-శిశు ఆరోగ్య సేవలు మరింత సులభంగా ప్రజలకు అందుతాయని అన్నారు.
మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధిలో భాగంగా రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలతో పాటు వైద్య, విద్యా రంగాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తూ మైలవరం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రెండు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
