భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

కృష్ణా జిల్లా పోలీస్ – హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్

క్రైమ్ న్యూస్ కృష్ణా :

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2026 జనవరి నుంచి జూలై వరకు నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల కేసులు, రౌడీ–సస్పెక్ట్ షీటర్ల బైండ్‌ఓవర్ తదితర అంశాలపై జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు జిల్లా పోలీస్ అధికారులతో హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఎస్పీ గారు మాట్లాడుతూ

నేరాల సంఖ్యను తగ్గించడంతో పాటు, నేరాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల స్వభావాన్ని విశ్లేషించి, నేరాలకు కారణమయ్యే అంశాలను గుర్తించి పటిష్టమైన ప్రివెంటివ్ పోలీసింగ్ చేపట్టాలని సూచించారు.

పెండింగ్ దర్యాప్తు కేసులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి. దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి చార్జిషీట్లు/ఫైనల్ రిపోర్టులు సకాలంలో దాఖలు చేయాలని సూచించారు. జిల్లాలో లాంగ్ పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు 30 శాతం తగ్గినప్పటికీ, మిగిలిన కేసులపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

తీవ్ర నేరాల దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావివ్వకూడదని, నేర స్థల పరిశీలన, ఆధారాల సేకరణ, సాంకేతిక ఆధారాల వినియోగం, నిందితుల గుర్తింపు తదితర అంశాల్లో శాస్త్రీయ దర్యాప్తు చేపట్టాలని సూచించారు. జిల్లాలో గ్రేవ్ కేసుల డిటెక్షన్ శాతం 2025లో 92.54 శాతం ఉండగా, 2026 జనవరి–జూలైలో 94.74 శాతానికి పెరిగిందని, ఈ పనితీరును మరింత మెరుగుపరచాలని తెలిపారు.

రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ గారు ఆదేశించారు. వారి కదలికలను పర్యవేక్షిస్తూ, నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రౌడీ షీటర్ల బైండ్‌ఓవర్ 80.6 శాతం ఉండగా, సస్పెక్ట్ షీటర్ల బైండ్‌ఓవర్ 66.2 శాతంగా ఉన్నందున సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

మహిళలు, బాలికలపై నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మహిళా పోలీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు ఇతర సంబంధిత వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలని తెలిపారు.

మిస్సింగ్ కేసుల్లో ప్రతి కేసును సీరియస్‌గా తీసుకుని తక్షణమే ట్రేస్ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 2026 జనవరి–జూలైలో మిస్సింగ్ కేసుల మొత్తం ట్రేసింగ్ శాతం 90.37గా నమోదైందని, 48 గంటల్లో ట్రేసింగ్‌పై కూడా మరింత దృష్టి పెట్టాలని సూచించారు.