భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..Written by రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక
రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి

ధర్నా, 29 ఆగస్ట్, ఇందిరా పార్క్ వద్ద, హైదరాబాద్. ఉదయం 10 గం. నుండి

ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా !

ప్రభుత్వాలు ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగం కల్పించిన సంక్షేమ విధానాలను విస్మరిస్తూ, కొనసాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారు. ఈ క్రమంలో మన దేశంలో ఐదు-ఆరు దశాబ్దాలుగా ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కుల కోసం బలమైన పోరాటాలకు ప్రధానంగా అడవులు, అడవి చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాలు కేంద్రంగా మారాయి. నిర్దిష్ట రాజకీయ దృక్పథంతోనే ఆ ఉద్యమాలు కొనసాగాయి. లక్షలాది ఆదివాసీలు ‘జల్, జంగల్, జమీన్, ఆత్మ గౌరవం’ కోసం పోరాడుతున్నారు. ఆ ఉద్యమాలపై తీవ్రమైన అణచివేత నిరంతరాయంగా కొనసాగుతున్నది.

దేశంలో శ్రమదోపిడికి వ్యతిరేకంగా కులమత విద్వేషాలు లేని సమాజాన్ని నెలకొల్పడం కోసం నేటికీ అనేక రాజకీయ పోరాటాలు కొనసాగుతున్నాయి. పలు రకాల రాజకీయ సిద్ధాంతాలు పునాదిగా అవి కొనసాగుతున్నాయి. ఆ రాజకీయాల ప్రభావం వలన వ్యక్తిగత స్వార్థాలు లేకుండా సామాజిక ప్రయోజనాల కోసం, మార్పు కోసం అనేక మంది ఉద్యమకారులు రాజకీయ కార్యకర్తలు ఇప్పటికే వేలాదిగా ప్రాణత్యాగాలు చేసి ఉన్నారు. అంతే కాక ఇటువంటి రాజకీయ పార్టీలు, సంస్థలకు, మావోయిస్టు పార్టీకి చెందిన వేలాది రాజకీయ కార్యకర్తలు దేశంలో జైళ్ళలో మగ్గుతున్నారు.