భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన రామవరం జట్టుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అభినందనలు
పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
తేదీ: 30-08-2026
ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో వేలేరుపాడు మండలం రామవరం పంచాయతీ పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన వాలీబాల్ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు జట్టు సభ్యులను అభినందించారు.
యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చిర్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులకు రెండు వాలీబాల్ కిట్లు, జెర్సీలు, బ్యాంకర్లు, అలాగే రూ.20,000 నగదు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థాయికి ఎదగగలరని అన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రామవరం పంచాయతీతో పాటు పోలవరం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకువచ్చిన జట్టు సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు మెచినేని సంజయ్, వాలీబాల్ జట్టు సభ్యులు మనోజ్ కుమార్, అభిరామ్, ఉదయ్ కిరణ్, వెంకన్న బాబు, గణేష్, పవన్ రాజు, అరవింద్, రాము తదితరులు పాల్గొన్నారు.
