భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఇటువంటి ఐఏయస్ అధికారుల్ని ఎంతమందిని తెలుగు రాష్ట్రాల్లో చూసి ఉంటారు ?
ముఖ్యంగా నడుస్తున్న చరిత్రలో …!
అసలు Indian Administrative Service కి చెందిన వాళ్లు ఎలా ఉండాలని, నడుచుకోవాలని ప్రజలు ఆశిస్తుంటారు ? వాళ్ళని ఎందుకు జాతీయస్థాయిలో కొన్న లక్షలమందిలోంచి ఎంపిక చేస్తారు? అలా ఎంపికయ్యాక ప్రజాప్రభుత్వాల వ్యవస్థలో వాళ్ళు తమని తాము కాపాడుకుంటూ, రాజకీయ అవరోధాల్ని అధిగమిస్తూ, దేశంకోసం, రాష్ట్రం కోసం అభివృద్ధి పనుల్ని సాధిస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి?
……. ఇలాంటి అనేక క్లిష్టమైన దృక్పథాల్ని అతి పిన్న వయసులోనే ఆకళింపు చేసుకున్న అసాధారణ వ్యక్తిత్వం పి.వి.ఆర్.కె. ప్రసాదుది.
భువనగిరి సబ్ కలెక్టర్ గా 1960 దశకం చివర్లో పనిచేశారు. పేదవాళ్ళ కోసం కేటాయించిన 500ఎకరాల సారవంతమైన భూమికి బదులుగా ఇంకోచోట బండలున్న 500 ఎకరాల భూమిని వాళ్ళకి కేటాయించేలా పెత్తందార్లు, రాజకీయ నాయకులు చేసిన కుట్రని త్రిప్పికొట్టిన ఏకైక ఐఏఎస్ అధికారి ప్రసాద్.
1972-73లో ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు గారి దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రత్యేకాంధ్రోద్యమ కాలంలో రాజకీయ అవసరాల కోసం పంపిణీకి ఉద్దేశించిన రూ. 10 లక్షలు (ఇప్పుడు దాని విలువ కనీసం ఒక కోటి) దాచమని ముఖ్యమంత్రి ఇస్తే, దాన్ని వదిలించుకునే దాకా నిద్రపట్టని తత్త్వం ప్రసాద్ ది.
కలెక్టరుగా ఖమ్మం జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా 24 గంటల్లో 500 ఎకరాల్ని భారీ పరిశ్రమకోసం చట్టబద్ధంగా అప్పగించే సాహసం చేసిన కార్యదక్షత, అత్యంత శక్తివంతమైన అత్యున్నత రెవెన్యూ బోర్డు శ్రీముఖాల్ని సయితం నిర్భయంగా ఎదుర్కొన్న ధైర్యం ప్రసాదువి.
1977లో దివి తాలూకా ఉప్పెనవల్ల వందలాది గ్రామాల్లో బావులు, చెరువులు, ఉప్పు నీటిమయమైతే, ఇరిగేషన్ డెవలప్ మెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా అసాధారణమైన మానవసంబంధాలు ఉపయోగించి, కొద్ది రోజుల వ్యవధిలో ఉప్పెన గ్రామాలన్నింటికీ త్రాగునీరు సరఫరా చేసిన సామర్థ్యం ప్రసాదుది.
సహకారశాఖ రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు ఆర్థిక సంవత్సరం చివర్లో ఢిల్లీ వెళ్ళి కూర్చుని, ఇతర రాష్ట్రాల నుంచి ఖర్చుపెట్టకుండా తిరిగి వచ్చేసిన కేంద్రనిధుల్ని ఆంధ్రప్రదేశ్ కి మళ్ళించిన పరిపాలనా చాతుర్యం ప్రసాదుది.
37 ఏళ్ళ వయస్సులో టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేరి, ఆయన చేసిన సేవలు రాయాలంటే ఒక మహాగ్రంథం అవుతుంది:
…. కాలినడకన కొండకి నడిచి ఎక్కే భక్తుడికి ఎండా వానల నుంచి షెల్టరు కావాలని ఆలోచించి, అమలుచేసినా…, నడిచి ఎక్కేవాడి సామాన్లు ఉచితంగా కొండకి చేరవేయాలని భావించి అమలుచేసినా…, కొండమీద తిరిగేందుకు ఉచిత బస్సుసౌకర్యం కల్పించినా…, రేకుల షెడ్ల స్థానంలో అప్పటికే డిజైన్ చేయబడిన వైకుంఠం క్యూకాంప్లెక్స్ ని అద్భుతంగా నిర్మింపజేసినా… క్రిక్కిరిసి ఉండే తిరుమలలో రాజకీయ ఒత్తిళ్ళకి, స్థానిక నాయకుల దాడులకి ఎదురుతిరిగి మరీ మాస్టర్ ప్లాన్ ని అమలుచేసినా…, అర్చక మిరాశీల పెత్తనాన్ని ధిక్కరించి సామాన్య భక్తులకోసం సాధారణ కళ్యాణోత్సవం (రూ. 500) వంటి సేవలు ప్రవేశపెట్టినా…, నిత్యాన్నదాన పథకాన్ని రచించినా…, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్టు వంటి పథకాల ద్వారా భక్తి సాహిత్యాన్ని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేసినా…, భక్తులకోసం తిరుమలేశుడి ప్రసాదంగా నిత్యాన్నదాన పథకాన్ని రూపొందించినా… అదంతా ప్రసాద్ కే సాధ్యపడింది. అందుకే ఆయన పేరు తిరుమలలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.
సమాచారశాఖ రూపురేఖల్ని మహోన్నతంగా మార్చివేసిన కమీషనర్ గా (1984-85) ఇప్పటికీ ప్రసాద్ పేరే మిగిలిపోయింది.
విశాఖపోర్టు ఛైర్మన్ గా (1988-92) – జాతీయస్థాయిలో అయిదో, ఆరో స్థానంలో ఉన్న – ఆ పోర్టుని ఒక్క పదిమాసాల కాలంలో ‘ నెంబర్-1’ స్థాయికి తీసుకెళ్ళి, మూడేళ్ళపాటు ఆ స్థాయిని నిలబెట్టిన ఘనత ప్రసాద్ ఒక్కరికే దక్కింది. పోర్టు నిర్వహణలో ప్రసాద్ చూపించిన పాలనాదక్షత ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజిమెంట్’ అన్నింటికీ పాఠ్యపుస్తకం చేయదగినంత చరిత్రాత్మకమైంది.
ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుకి కళ్ళూ, చెవులూ తానే అయి, అయోధ్య రామమందిర సమస్యవంటి అనేక సమస్యలకు తెరవెనుక ప్రసాద్ నడిపిన రాజనీతిజ్ఞత ఈ కాలపు ఔత్సాహిక రాజకీయ నాయకులంతా నేర్చుకోదగింది.
ఎంత క్లిష్టమైన సమస్యల సుడిగుండంలో మునిగివున్నా చిరునవ్వుతో ఎదుర్కోవటం, “మన శక్తిమేరకు మనం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఫలితం సంగతి తిరుమల శ్రీనివాసుడే చూసుకుంటాడన్న” భక్తి విశ్వాసాలు, తన విలువల్ని డబ్బుతో కొనాలని యత్నించిన వాళ్ళని జైలుకి పంపుతూ, నీతిపరులైన అధికారుల్ని కాపాడుకుంటూ వచ్చిన నిజాయితీ, ఎలాంటి భారమైన సందర్భాల్ని సయితం తన చతురోక్తులతో తేలికపరచే వాక్చాతుర్యం, రిటైర్మెంట్ తరువాత కూడా ధార్మిక ఉద…
