గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి.
భారత్ డిజిటల్ న్యూస్ (తిరుపతి ఆగస్టు 29, రేణిగుంట: మీ రిపోర్టర్ హేమంత్). తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రేణిగుంట పోలీసుల ఆధ్వర్యంలో తారకరామారావు నగర్లో గంజాయి, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, సీఐ జయచంద్ర గారి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పింక్ బస్‌లో బయో కిట్ల ద్వారా గంజాయి వినియోగంపై పరీక్షలు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, యువతను అప్రమత్తం చేయడం, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా యువతకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, విద్య, ఉపాధి, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని అధికారులు వివరించారు.
యువత చెడు స్నేహాలు, మత్తు పదార్థాల ప్రలోభాలకు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
- పోలీసుల సహాయం కోసం.
- డయల్ 112: అత్యవసర పోలీసు సేవలు, తక్షణ సహాయం కోసం.
- ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్: 1972: గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలు, రవాణా తదితర సమాచారాన్ని తెలియజేయడానికి.
- మాదకద్రవ్యాలపై సమాచారం ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారరు యువతకు సందేశం ఇస్తూ, “యువతే దేశ భవిష్యత్తు. మాదకద్రవ్యాలకు బానిసై మీ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండండి. మీ చుట్టూ ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే నిర్భయంగా పోలీసులకు తెలియజేయండి. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. యువత తమ శక్తిని విద్య, ఉపాధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి మరియు సృజనాత్మక కార్యక్రమాల వైపు మళ్లించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి.”ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానికులు, యువత పాల్గొన్నారు.
