భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రానికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో భానుడి ప్రతాపం నుంచి ప్రజలకు ఎంతో ఊరట లభించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి సమయానికి తీవ్రరూపం దాల్చి.. మంగళవారం రోజంతా కురుస్తూనే ఉంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో రోజంతా ఆకాశం మేఘావృతమై ముసురు వాతావరణం నెలకొంది.
ఈ వర్షాల వల్ల పలు జిల్లాల్లో ఎండిపోయిన వాగులు, వంకలు ఒక్కసారిగా జీవం పోసుకుని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ములుగు, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో సోమవారం నుంచి నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది.

వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం..నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. రానున్న మరికొన్ని గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ మంగళవారం రోజంతా వాతావరణం చల్లగా మారి తేలికపాటి జల్లులు కురిశాయి. నార్త్ హైదరాబాద్ పరిధిలో రాబోయే 2 గంటల్లో తేలికపాటి వర్షాలు లేదా చినుకులు పడే అవకాశం ఉంది. నగరంలో నేడూ కూడా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి.. సాయంత్రం, రాత్రి వేళల్లో చిన్నపాటి వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం వేళల్లో అక్కడక్కడా జల్లులు పడతాయని.. రాబోయే 24 గంటల పాటు రాష్ట్రంలో ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. సాధారణంగా మే చివరి వారం, జూన్ మెుదటి వారంలో రావాల్సిన పవనాలు.. ఈ ఏడాది జూన్ రెండో వారంలో ప్రవేశించాయి. అయినా ఆశించనంతగా వర్షాలు కురవలేదు. చాలా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలపైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు.
