బాధిత మహిళలు మరియు చిన్నారులకు అండగా “సఖి – వన్ స్టాప్ సెంటర్”||విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…విజయనగరం జిల్లా పోలీసు||

||బాధిత మహిళలు మరియు చిన్నారులకు అండగా “సఖి – వన్ స్టాప్ సెంటర్”||
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జిల్లాలో స్థానిక ఉడా కాలనీలో ఉన్న వన్ స్టాప్ సెంటర్‌ను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు జూలై 17న సందర్శించారు. “సఖి – వన్ స్టాప్ సెంటర్” ద్వారా బాధిత మహిళలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు మాట్లాడుతూ – మహిళలు, బాలికలకు అత్యవసర పరిస్థితుల్లో భద్రత, ఉచిత న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, తాత్కాలిక ఆశ్రయం వంటి సమగ్ర సేవలను ఒకేచోట వన్ స్టాప్ సెంటర్ లో అందిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో మహిళలకు అందుతున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ గారు, బాధితులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు సమర్థవంతంగా అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

అనంతరం వన్ స్టాప్ సెంటర్‌లోని రిజిస్టర్‌లు, కేసుల నిర్వహణ విధానం, కౌన్సెలింగ్ సేవలు, న్యాయ సహాయం, వైద్య సేవల సమన్వయం, అత్యవసర స్పందన విధానాలను ఎస్పీ గారు పరిశీలించారు. వన్ స్టాప్ సెంటర్ లో ఆశ్రయం కోసం వచ్చిన మహిళలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

మహిళలపై జరిగే వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి కేసుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడం వన్ స్టాప్ సెంటర్ ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రతి బాధితురాలిని సానుభూతితో, గౌరవంతో చూడాలని, వారి వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ చట్టపరమైన అన్ని సహాయాలు అందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. మహిళల మరియు చిన్నారుల భద్రతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలలో మరింత విస్తృతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

మహిళలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో జీవించేలా పోలీసు శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ, న్యాయ సేవా సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు పోలీసు సహాయం కోసం 100/112, మహిళల సహాయ కేంద్రం 181, 1098 అలాగే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

మహిళల భద్రతకు జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పోలీసు అధికారి బాధిత మహిళలకు భరోసా కల్పించే విధంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను అత్యంత సున్నితంగా స్వీకరించి వేగంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం వన్ స్టాప్ సెంటర్‌లో పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు, విశ్రాంతి గదులు, కౌన్సెలింగ్ గదులు, వైద్య సహాయ సదుపాయాలను కూడా జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ, పి.వి.వి.నరసింహారావు, సిఐ ఈ.నరసింహమూర్తి, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పి.విజయలక్ష్మి, డొమెస్టిక్ వయోలెన్స్ సెల్ లీగల్ కౌన్సిలర్, మాధవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||