పాకాల మండలంలో గంజాయి,డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కార్యక్రమం
పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా పోలీసు శాఖ గంజాయి,మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి డివిజన్ డీఎస్పీ బేతపూడి ప్రసాద్ పర్యవేక్షణలో పాకాల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చిన్న గోవిందు,తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్,సబ్ డివిజన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్లు మరియు పోలీసు సిబ్బంది సంయుక్తంగా పాకాల మండలం దామలచెరువు గ్రామంలోని మాంగో నగర్ ప్రాంతంలో విస్తృత స్థాయిలో గంజాయి, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మామిడి తోటలు మరియు మామిడి పండ్ల వ్యాపారాలకు సంబంధించిన కార్మికులు, లారీ డ్రైవర్లు, లోడింగ్–అన్‌లోడింగ్ కార్మికులు, హమాలీలు, ఇతర శ్రామికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి,గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ జీవితం, ఉపాధి, సమాజంపై కలిగే దుష్పరిణామాలను వివరించారు.మాదక ద్రవ్యాల బానిసత్వం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని,అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.అనంతరం అక్కడ పనిచేస్తున్న కార్మికులు మరియు లారీ డ్రైవర్లకు ప్రత్యేక డ్రగ్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు.మొత్తం 250 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురు గంజాయి వినియోగించినట్లు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి.పాజిటివ్ వచ్చిన నలుగురు వ్యక్తులను పోలీస్ అధికారులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేసి, ఇది మొదటిసారి కావడంతో మానవతా దృక్పథంతో హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు.ఇకపై గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించడం,నిల్వ చేయడం, రవాణా చేయడం లేదా విక్రయించడం వంటి నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.మాదక ద్రవ్యాల అలవాటు పూర్తిగా మానుకుని కుటుంబ సభ్యులతో కలిసి మంచి జీవితం గడపాలని వారికి సూచించారు.ఈ సందర్భంగా పాకాల ఇన్స్పెక్టర్ చిన్న గోవిందు మాట్లాడుతూ, తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు నిరంతరం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. గంజాయి విక్రయదారులు,రవాణాదారులు, వినియోగదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా గంజాయి విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.ప్రజల సహకారంతోనే గంజాయి రహిత సమాజాన్ని నిర్మించగలమని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పాకాల మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా నిరంతరం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు
