మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం అందించాలి – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.

భారత్ న్యూస్ విజయవాడ…మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం అందించాలి – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.

మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 50 ఫిర్యాదులు స్వీకరణ

క్రైమ్ న్యూస్ కృష్ణా :

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ గారు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్. మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసు కార్యాలయానికి వస్తున్నప్పుడు వారికి ఆత్మీయత, మర్యాద, సహానుభూతితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుదారుల సమస్యలను చిరునవ్వుతో స్వీకరించి, వారి బాధను ఓర్పుతో వింటే వారు మానసికంగా ఎంతో ఊరట పొందుతారని అన్నారు.

ప్రతి ఫిర్యాదుదారునితో మనస్ఫూర్తిగా మాట్లాడి, వారి సమస్యను పూర్తిగా తెలుసుకుని, చట్ట పరిధిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని నమ్మకం కలిగించాలని ఎస్పీ గారు తెలిపారు. ప్రజలకు పోలీసు శాఖపై విశ్వాసం మరింత పెరిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

మీకోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ గారు ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించి, చట్ట ప్రకారం విచారణ జరిపి తగిన పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈరోజు నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో మొత్తం 50 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి.