మోదీ..మీడియాతో మాట్లాడరేం? ప్రధానిపై ఎడిటర్స్‌ గిల్డ్‌ విమర్శలు.

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..మోదీ..మీడియాతో మాట్లాడరేం? ప్రధానిపై ఎడిటర్స్‌ గిల్డ్‌ విమర్శలు.

ఈ సంక్షోభ కాలంలో ప్రజలతో నేరుగా మాట్లాడాలి.ప్రధాని మౌనంపై అధికారుల సమర్థింపు లోపభూయిష్టం.ప్రజాస్వామ్యంలో మీడియాతో మాట్లాడటం తప్పనిసరి

\పత్రికా సమావేశాలు నిర్వహించని ప్రధాని నరేంద్ర మోదీ విధానాన్ని విదేశీ వ్యవహారాల శాఖ సమర్థించడం తీవ్ర లోపభూయిష్టం అంటూ ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా తప్పుపట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు మీడియాను విస్మరించరని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా మీడియాతో క్రమం తప్పకుండా సంభాషించడం, వారి ప్రశ్నలకు సమాధానమివ్వడం జరుగుతుందని ఎడిటర్స్‌ గిల్డ్‌ వివరించింది.

ప్రధాని మోదీ స్వదేశంలో గానీ, విదేశాల్లో గానీ ముందుగా సిద్ధం కాకుండా పత్రికా సమావేశాలు నిర్వహించడానికి అయిష్టత చూపడాన్ని సమర్థిస్తూ ఒక విజయవంతమైన రాజకీయవేత్తగా మోదీ దేశంలోని అధిక శాతం గ్రామీణ ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు ఇష్టపడతారని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ఇటీవల ఇచ్చిన వివరణను ఎడిటర్స్‌ గిల్డ్‌ గురువారం విమర్శించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ముఖ్యంగా ప్రపంచం తీవ్ర ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో అత్యవసర రాజకీయ, ఆర్థిక అంశాలపై పట్టణ, గ్రామీణ ప్రజలకు ప్రధాని క్రమం తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని గిల్డ్‌ పేర్కొంది.