శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా::: భారత్ డిజిటల్ న్యూస్ ప్రతినిధి ::::: ::::ఆపదలో ఉన్న మహిళలకు భరోసా కేంద్రాలుగా సఖి సెంటర్లు
“హింసకు గురైన బాధితులకు మరింత నాణ్యమైన సేవలందించడమే లక్ష్యం”
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ డా. రాయపాటి శైలజ
సమాజంలో పలు రకాలుగా హింసకు గురైన మహిళలకు సఖి (వన్ స్టాప్ సెంటర్లు) కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ డా. రాయపాటి శైలజ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ఎన్. సి.డబ్ల్యూ. సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల (జీజీహెచ్) లెక్చర్ గ్యాలరీలో 14 సఖి వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన “ట్రామా-ఇన్ఫార్మ్డ్ కేర్, మానసిక ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, హింసకు గురైన బాధితులకు సమర్థవంతమైన సేవలందించే విధానాలు” తదితర అంశాలపై అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా. రాయపాటి శైలజ మాట్లాడుతూ…ఆపదలో ఉన్న మహిళలకు సఖి (వన్ స్టాప్ సెంటర్)లు చివరి ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఒకే చోట వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, ఎఫ్ఐఆర్ నమోదు, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలను అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. శారీరక వేధింపులు, లైంగిక దాడులు, గృహహింస, యాసిడ్ దాడులు వంటి వివిధ రకాల హింసకు గురైన మహిళలను అత్యంత సున్నితంగా, గౌరవప్రదంగా ఎలా సంప్రదించాలి, వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని ఎలా సహాయపడాలి, తిరిగి మానసిక గాయం కలగకుండా (రీ-ట్రామాటైజేషన్) ఎలా సేవలు అందించాలనే అంశాలపై ఈ శిక్షణలో సమగ్ర అవగాహన కల్పించినట్లు వివరించారు.
ఇలాంటి బాధాకరమైన కేసులను నిరంతరం నిర్వహించే సఖి సిబ్బంది కూడా తమ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని, పని ఒత్తిడిని అధిగమిస్తూ సేవలను మరింత సమర్థవంతంగా అందించేలా స్వీయ సంరక్షణ పద్ధతులపై కూడా ఈ శిక్షణలో మార్గనిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు.
గుంటూరు నుంచి రాయలసీమ ప్రాంతం వరకు ఉన్న 14 జిల్లాల సఖి (వన్ స్టాప్ సెంటర్) లీగల్ అడ్వైజర్లు, కౌన్సిలర్లు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారని, వారి వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించి మహిళలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ అవగాహన సదస్సు ప్రధాన ఉద్దేశమని డా. రాయపాటి శైలజ పేర్కొన్నారు. బాధిత మహిళలకు మరింత సానుభూతితో, మానవీయ దృక్పథంతో, సమర్థవంతమైన సేవలు అందించేందుకు సఖి (వన్ స్టాప్ సెంటర్) సిబ్బంది నిరంతరం తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం సదస్సులో పాల్గొన్న సఖి సిబ్బంది నిపుణులతో సందేహాలను నివృత్తి చేసుకుని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు.
తొలుత నెల్లూరు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ రాయపాటి శైలజకు నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం పలువురు మహిళలు తమ సమస్యలపై మహిళా కమిషన్ చైర్పర్సన్ కు వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ అడ్వైజర్ రావూరి సూయజ్, సిబ్బంది టి.మాధవీ లత, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, అడ్వకేట్ నాగరాజవర ప్రసాద్, డిఎస్పీ గిరిధర్, డాక్టర్ శరత్ కృష్ణ, డాక్టర్ ప్రసన్న లక్ష్మి తదితర నిపుణులు చట్టపర, మానసిక ఆరోగ్య అంశాలపై సఖి సిబ్బందికి శిక్షణ అవగాహన కల్పించారు. 14 జిల్లాలకు చెందిన వన్ స్టాప్ సెంటర్ లీగల్ అడ్వైజర్లు, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

