గరుడ వాహనంపై దివ్య కటాక్షం ప్రసాదించిన శ్రీ సుందరరాజస్వామివారు
వైభవంగా ముగిసిన మూడు రోజుల శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు
తిరుపతి (భారత్ న్యూస్) మీ రిపోర్టర్ హేమంత్. తిరుచానూరులోని శ్రీ సుందరరాజస్వామివారు మంగళవారం రాత్రి గరుడ వాహనంపై దివ్యంగా విహరిస్తూ భక్తులకు అభయానుగ్రహాలు ప్రసాదించారు. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు మంగళవారంతో శాస్త్రోక్తంగా ముగిశాయి.
మహోత్సవాల చివరి రోజున మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో మహా అభిషేకం ఘనంగా నిర్వహించారు.
వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ అభిషేక సేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది.
అనంతరం సాయంత్రం 5.45 గంటలకు శ్రీకృష్ణస్వామివారి ముఖ మండపంలో ఊంజల్ సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. “గోవింద… గోవింద…” నామస్మరణల మధ్య జరిగిన గరుడ వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరేంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.