హోంగార్డుల ఉద్యోగ భద్రత కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హోంగార్డుల ఉద్యోగ భద్రత కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి

వాలంటీర్ వ్యవస్థకు ముగింపు పలికి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు చట్టంలో మార్పులు చేయాలని తెలంగాణ రాష్ట్ర హోంగార్డుల సంక్షేమ సంఘం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించింది.

సంఘం అధ్యక్షుడు పుప్పాల అశోక్ ఆధ్వర్యంలో సమర్పించిన ఈ వినతిలో, దేశవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది హోంగార్డులు శాంతిభద్రతల పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, ఇప్పటికీ వాలంటీర్లుగానే కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

సుమారు 70 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగా హోంగార్డులు శ్రమదోపిడీకి గురవుతున్నారని, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, ఇతర సంక్షేమ సౌకర్యాలు లేక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో వివరించారు.

హోంగార్డుల ఆర్థిక పరిస్థితులు, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని మార్చి, చట్ట సవరణల ద్వారా శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా 1946–47, 1962–63 నాటి హోంగార్డ్ చట్టాల్లో అవసరమైన మార్పులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్ర హోంగార్డుల సంక్షేమ సంఘం కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో హోంగార్డ్ ఆఫీసర్స్ నారాయణ రెడ్డి, నర్సింగ్,జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.