భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్స్ షాపులో పేలుళ్లు!
హైదరాబాద్, నవంబర్ 08 | నిజం న్యూస్;
సికింద్రాబాద్‌లోని సీతాఫల్మండి ప్రాంతంలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎవరో కాల్చిన రాకెట్ నేరుగా దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది.
రాకెట్ దుకాణంలో పడగానే లోపల ఉన్న బాణసంచా ఒక్కసారిగా పేలిపోవడం ప్రారంభమైంది. వరుస పేలుళ్లతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పేలుళ్ల శబ్దానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. దుకాణం సమీపంలో ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొంతసేపు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నిలిపివేసి, ప్రజలు దగ్గరకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా, ఆస్తి నష్టం ఎంత అనే వివరాలు తెలియాల్సి ఉంది.

బాణసంచా కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, దుకాణాలు, జనావాసాల సమీపంలో రాకెట్లు కాల్చవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.