రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం….రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘనవిజయంతో రాష్ట్ర ప్రజలకు ముందుగానే దీపావళి
  • ఓట్లనే దీపాలుగా వెలిగించి వైసీపీ రాజకీయ అహంకారాన్ని దహనం చేసిన ప్రజలు
  • కేసులు, వివాదాల నీడలో ఉన్న జగన్‌కు మరోసారి అధికారం అప్పగించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు
  • నరకాసురుడి అహంకారానికి అంతం పలికినట్లే.. జగన్ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు

అమరావతి, నవంబర్ 07: వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. నరకాసుర సంహారంతో ముడిపడిన ఈ పర్వదినం అన్యాయం ఎంత బలమైనదైనా అంతిమ విజయం ధర్మానిదేననే సందేశాన్ని ఇస్తుందన్నారు. ప్రతి ఇంటా ఆనందదీపాలు వెలగాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, సుభిక్షతతో ముందుకు సాగాలని, రైతులు, కార్మికులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో దీపావళి కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నారు.

రాష్ట్ర ప్రజలకు ఈసారి దీపావళి ముందుగానే వచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన ఘనవిజయమే అందుకు నిదర్శనమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పురాణాల్లో నరకాసురుడి అహంకారానికి అంతం పలికినట్లే, రాష్ట్ర ప్రజలు ఓట్లనే ఆయుధాలుగా మలిచి జగన్ రాజకీయ అహంకారాన్ని దహనం చేశారని వ్యాఖ్యానించారు. దీపావళి మంటల్లో వైసీపీ అరాచక రాజకీయాలను కాల్చి బూడిద చేసినంత స్పష్టంగా ప్రజలు తీర్పునిచ్చారన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతోనైనా జగన్‌కు కనువిప్పు కలుగుతుందని భావించామని, కానీ ఆయన వైఖరిలో మార్పు రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని విమర్శించారు. చివరకు సొంత రాజకీయ కంచుకోటగా చెప్పుకొనే పులివెందులలోనూ వైసీపీకి ఎదురైన పరాభవం జగన్‌పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. అవినీతి, అక్రమాస్తుల కేసులు ఎదుర్కొంటూ ప్రజలకు నీతులు చెప్పే నైతిక అర్హత జగన్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. అధికారం కోల్పోయినా అహంకారం వీడని జగన్‌కు ప్రజాస్వామ్యంలో స్థానం నిర్ణయించేది ప్రజలేనన్న వాస్తవం ఇంకా అర్థం కాలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ ప్రజాతీర్పును ప్రశ్నించడం జగన్ రాజకీయ దివాళాకోరుతనానికి పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే కలలు కనడం మానుకోవాలని, ఆయన విధ్వంసకర రాజకీయాలకు మరోసారి అధికారం అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరని తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.