సుప్రీంకోర్టు సంచలన తీర్పు: వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిపై కుటుంబ సభ్యులకే మొదటి హక్కు!

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..సుప్రీంకోర్టు సంచలన తీర్పు: వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిపై కుటుంబ సభ్యులకే మొదటి హక్కు!

సొంతవారిని కాదని బయటి వ్యక్తులకు అమ్మితే అడ్డుకునే హక్కు కుటుంబ సభ్యులకు ఉంటుంది.

న్యూఢిల్లీ, జూలై 14:

హిందూ వారసత్వ చట్టం ప్రకారం, కుటుంబ సభ్యులకు వచ్చిన ఉమ్మడి వ్యవసాయ భూమిని తోబుట్టువులు ఎవరైనా బయటి వారికి విక్రయించాలనుకుంటే, దానిని ఆపే హక్కు మిగిలిన కుటుంబ సభ్యులకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కుటుంబ ఆస్తుల పంపకాలకు సంబంధించి ఒక కీలకమైన చట్టపరమైన వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. హిందూ వారసత్వ చట్టం-1956 (సెక్షన్ 22) ప్రకారం, ఉమ్మడి ఆస్తిగా వచ్చిన వ్యవసాయ భూమిని విక్రయించేటప్పుడు మొదటి తరగతి (Class-I) వారసులకే ప్రాధాన్యత ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. వ్యవసాయ భూములకు ఈ నిబంధన వర్తించదంటూ దాఖలైన అప్పీల్‌ను న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది.

జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నాంగ్మీకపం కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ‘మహీందర్ వర్సెస్ పూరన్ సింగ్’ కేసులో ఈ తీర్పును వెలువరించింది. అంతకుముందు పంజాబ్-హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ, ఈ వివాదానికి ముగింపు పలికింది.

అసలు వివాదం ఏమిటి?

కర్నాల్ జిల్లాలోని కైమ్లా గ్రామానికి చెందిన నాన్హు అనే వ్యక్తి పిల్లల మధ్య ఈ భూవివాదం మొదలైంది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని ఏడుగురు తోబుట్టువులు కలిసి ఒక బయటి వ్యక్తికి అమ్మేయడానికి సిద్ధపడ్డారు. అయితే, మిగిలిన ఒకే ఒక్క వారసుడైన పూరన్ సింగ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టం ప్రకారం ఆ భూమిని కొనుగోలు చేసే మొదటి హక్కు (ముందస్తు కొనుగోలు హక్కు – Pre-emption right) తనకే ఉంటుందని ఆయన కోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టు మొదట దీనిని తిరస్కరించినప్పటికీ, హైకోర్టు మరియు తాజాగా సుప్రీంకోర్టు పూరన్ సింగ్ వాదనను పూర్తిగా సమర్థించాయి.

ఈ కేసులో పూరన్ సింగ్ తరఫున హాజరైన ప్రముఖ న్యాయవాది సి. క్రాంతి కుమార్ రాజ్యాంగం ప్రకారం వ్యవసాయ భూమి వారసత్వంపై చట్టాలు చేసే పూర్తి అధికారం పార్లమెంటుకు ఉందని,హర్యానా రాష్ట్రంలో దీనికి విరుద్ధమైన చట్టం ఏదీ లేనందున కేంద్ర చట్టమే ఇక్కడ చెల్లుతుందని ఆయన వాదించారు. దీనికి మద్దతుగా 2005లో చట్టం నుండి సెక్షన్ 4(2)ని కూడా పార్లమెంటు తొలగించిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ తీర్పు ఎందుకు ముఖ్యం?

ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా ఉన్న గందరగోళానికి తెరపడింది. ఇకపై హిందూ కుటుంబాలలో సంయుక్తంగా ఉన్న వ్యవసాయ భూమిని ఎవరైనా విక్రయించాలనుకుంటే, ముందుగా తమ తోబుట్టువులకే ఆ వాటాను కొనే అవకాశం ఇవ్వాలి. కోర్టులో కేసు నడుస్తుండగా తొందరపడి బయటి వారికి భూమిని అమ్మేసి చట్టం నుండి తప్పించుకోవాలని చూస్తే కుదరదని ఈ తీర్పు హెచ్చరిస్తోంది.