చిన్నారి కుటుంబానికి వ్యక్తిగతంగా అండగా నారా లోకేశ్‌..

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..చిన్నారి కుటుంబానికి వ్యక్తిగతంగా అండగా నారా లోకేశ్‌..!

మణిపాల్‌ ఆసుపత్రికి వెళ్లి పరామర్శ.. తండ్రికి వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ ఇచ్చి భరోసా..!!

బెంగళూరు:

రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో ఉన్న మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, అందుతున్న చికిత్సపై వైద్యులతో సుదీర్ఘంగా చర్చించారు.

బాలికకు అవసరమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు మంత్రికి వివరించారు. రక్తమార్పిడి, ఇతర సహాయక చికిత్సలతో పరిస్థితిని స్థిరీకరించామని, ప్రధాన రక్తస్రావాన్ని నియంత్రించామని తెలిపారు. అయితే, రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని వైద్యులు వివరించడంతో, ఆ సమయమంతా బాలిక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని లోకేశ్‌ సూచించారు.

అనంతరం పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న బాలికను పరిశీలించారు. చిన్నారిని తమ బిడ్డలా భావించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. బాలిక ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్న వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి.. తండ్రికి తన వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ అందజేశారు. ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా ఫోన్‌ చేయవచ్చని, మెసేజ్‌ చేయవచ్చని భరోసా ఇచ్చారు. టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆ కుటుంబానికి అండగా ఉంటానని, అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఘటన జరిగిన తీరును స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. బాలికపై దాడికి పాల్పడిన వ్యక్తిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థిని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు.

ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రాయపాటి శైలజ, విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా తదితరులు పాల్గొన్నారు.