భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..జిల్లాలోఎన్నికలకు భారీ బందోబస్తు
– 2,500 మంది సిబ్బందితో బందోబస్తు
– డ్రోన్, సీసీ కెమేరాలతో నిరంతరం నిఘా
– ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు తప్పవు
– జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు హెచ్చరిక
క్రైమ్ న్యూస్ కృష్ణా :
జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అల్లర్లు, అలజడులు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పెద్త ఎత్తున సిబ్బందిని రంగంలోకి దింపింది. ఓటర్‌లు తమ ఓటును స్వేచ్చాయుత వాతావరణంలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది.
2500 మంది సిబ్బందితో బందోబస్తు ః
జిల్లాలోని 1266 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనుండగా బందోబస్తు నిమిత్తం 2,500 మంది పోలీస్, ఇతర భద్రతా సిబ్బందిని నియమిస్తూ జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్‌నాయుడు ఆదేశాలు జారీ చేశారు. బందోబస్తుకు సంబంధించి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 37 మంది సీఐలు, ఆర్‌ఐలు, 88 మంది ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 325 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లుతో పాటు మరో 630 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 410 మంది హోంగార్డులు, 123 మంది ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది, 282 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులు, 380 మంది ఎన్‌ఎస్‌ఎస్ సిబ్బందిని రంగంలోకి దింపారు. వీరితో పాటు పదవీ విరమణ పొందిన ఆర్మీ, పోలీస్ సిబ్బంది సేవలను కూడా ఎన్నికల భద్రతలో భాగంగా వినియోగించుకోనున్నారు.
నిరంతరం నిఘా ః

జిల్లాలో జరగబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు చర్యలు చేపట్టారు. అందుకోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా తగిన సంఖ్యలో పోలీస్ సిబ్బందిని నియమించడంతో పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఏర్పాటుచేశారు.. అదేవిధంగా డ్రోన్ కెమెరాల ద్వారా సున్నితమైన ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు గుర్తించిన వెంటనే సంబంధిత పోలీస్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ప్రలోభాలకు ప్రయత్నిస్తే చర్యలు ః ఎస్పీ
విద్యాసాగర్‌నాయుడు
ఎన్నికల సమయంలో ఓటర్లను డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు గురిచేయడంతో పాటు ఓటర్లను భయపెట్టటం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులు ఎలాటివారైనా ఉపేక్షించేదిలేదని ఎస్పీ హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని తెలిపారు. ప్రజలు తమ ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోకుండా ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయని ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది ఉండదని ఖరాఖండిగా చెప్పారు. అలాగే ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, పోలీస్ శాఖకు రాజకీయ పార్టీలు, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు.