సీఎం భద్రతా విభాగంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో గన్‌మెన్ కిరణ్ మృతి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..సీఎం భద్రతా విభాగంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో గన్‌మెన్ కిరణ్ మృతి

హైదరాబాద్, జూలై 15 :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విభాగంలో గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన కిరణ్ అకాల మరణం పోలీస్ వర్గాలతో పాటు ఆయన సహచరులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

2009 బ్యాచ్‌కు చెందిన కిరణ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరినప్పటి నుంచి ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. తన సేవా ప్రస్థానంలో మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేయగా, అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి భద్రతా బృందంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ వింగ్‌లో గన్‌మెన్‌గా సేవలందిస్తూ తన వృత్తిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

సిద్దిపేట సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కిరణ్, ఉన్నత విద్య కోసం సిద్దిపేటలోని వైపీఆర్ (YPR) డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే సేవాభావం, క్రమశిక్షణతో ఎదిగిన ఆయన పోలీస్ శాఖలో చేరి ప్రజాసేవను తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు.

సహచరుల మాటల్లో కిరణ్ ఎంతో మృదుస్వభావి. అందరితో ఆప్యాయంగా మెలిగే ఆయన ఎంతటి ఒత్తిడిలోనైనా చిరునవ్వుతో విధులు నిర్వర్తించేవారు. కష్టపడే తత్వం, బాధ్యతాయుత సేవాభావం కలిగిన అధికారిని కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటని సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న వయసులోనే జరిగిన ఈ విషాదం అందరినీ కలచివేసింది. కిరణ్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ, పలువురు పోలీస్ అధికారులు, సహచరులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.