భాగ్యనగరంలో భారీ వర్షం.లోతట్టు ప్రాంతాల జలమయం

భారత్ న్యూస్ హైదరాబాద్…భాగ్యనగరంలో భారీ వర్షం.లోతట్టు ప్రాంతాల జలమయం

హైదరాబాద్ : భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా లోతట్టు కాలనీలు, ప్రధాన రహదారులు, కూడళ్లలో నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, యూసఫ్‌గూడ, టోలీచౌకి, ఫిలింనగర్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా సాగుతుండగా, కొన్ని చోట్ల ట్రాఫిక్ జాం అయింది. కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రజలు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

వాతావరణ శాఖ అధికారులు మరికొన్ని గంటల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, చెట్లు, నీటితో నిండిన ప్రాంతాల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

భారీ వర్షాల ప్రభావంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..