భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ఉక్కపోతకు బ్రేక్.. ఏపీకి కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్లో ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేడి, ఉక్కబోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమయంలో భారత వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది.
రాగల మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. దీని ప్రకారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వరకు ఆకాశంలో మేఘాలు, గాలులతో కూడిన ద్రోణి ఏర్పడింది. కర్ణాటక వైపు ఉన్న మరో ఉపరితల ఆవర్తనం కూడా ఈ ద్రోణిలో విలీనమైంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో వానలు పడనున్నాయి.
వాతావరణ హెచ్చరిక మేరకు ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అనకాపల్లి, పోలవరం, కాకినాడ, అన్నమయ్య జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, రోలుగుంట, బుచ్చయ్యపేట మండలాల్లో కొంచెం గట్టిగానే వర్షాలు పడ్డాయి. అలాగే పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో మోస్తారు వర్షం, కాకినాడ జిల్లా తునిలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.

కోస్తాంధ్రా.. యానాంలో…
కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన ఈదురుగాలులు ప్రజలను ఇబ్బంది పెట్టొచ్చని అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా సోమ, మంగళవారాల్లో వాతావరణం కాస్త చల్లబడుతుందని, ఈ రెండు రోజుల్లో అక్కడక్కడా మోస్తరు జల్లులు మాత్రమే పడే అవకాశం ఉందని తెలిపారు.
రాయలసీమలో కూడా..
రాబోయే మూడు రోజుల పాటు రాయలసీమ వ్యాప్తంగా వాతావరణం చల్లబడనుంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, పైగా కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీసే ఛాన్స్ ఉందని,ఈదురుగాలులు, పిడుగులు పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాయలసీమలో వర్షాల వార్త నిజంగా గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే నైరుతి పవనాలు ముగిసే నాటికి ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టుల కింద వాటర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాయలసీమలోని 12 కీలక జలాశయాల మొత్తం సామర్థ్యం 117.16 టీఎంసీలు. కానీ సెప్టెంబర్ చివరికి అందులో 63.14 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. అంటే జలాశయాలు సుమారు 54 టీఎంసీల ఖాళీ ఉంది. దీంతో అక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు పడున్నాయి.