పోలీసు అమరవీరుల త్యాగాలకు ఘన నివాళులు – తిరుపతి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సంస్మరణ దినోత్సవం.

పోలీసు అమరవీరుల త్యాగాలకు ఘన నివాళులు – తిరుపతి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సంస్మరణ దినోత్సవం.

భారత్ డిజిటల్ న్యూస్(మీ రిపోర్టర్ హేమంత్) తిరుపతి, అక్టోబర్ 20: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం–2026 ను పురస్కరించుకుని బుధవారం తిరుపతి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, ఐఏఎస్., జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., వారు ముఖ్య అతిథులుగా పాల్గొని అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది అతిథులకు గౌరవ వందనం సమర్పించగా, పోలీసు అమరవీరుల గౌరవార్థం స్మృతి పరేడ్ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం అసాంఘిక శక్తులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన పోలీసు అధికారులు, సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, ఐఏఎస్., మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన వారి సేవలు యావత్ సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఏదైనా ఆపద సంభవించినప్పుడు ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులేనని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందిస్తూ ప్రజల రక్షణ కోసం పోలీసులు ముందుండి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలకు తొలి స్పందన వ్యవస్థగా పోలీసులు అందిస్తున్న సేవలుnఅభినందనీయమని అన్నారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అధికారుల త్యాగాలను గౌరవించడంతో పాటు, వారి కుటుంబాలకు అవసరమైన ప్రభుత్వ సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ, శాంతియుత వాతావరణాన్ని కాపాడటంలో పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అమరవీరుల ధైర్యసాహసాలు, దేశభక్తి, సేవాభావాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం తమ బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పోలీసు విధి అనేది కేవలం ఉద్యోగ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, అవసరమైతే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే మహత్తరమైన ప్రజాసేవ అని తెలిపారు.

ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ ప్రజల భద్రత కోసం పోలీసులు మేల్కొని ఉంటారని, పండుగలు, కుటుంబ వేడుకలు వంటి వ్యక్తిగత సందర్భాలను సైతం పక్కనపెట్టి ప్రజల రక్షణకు అంకితమవుతారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు ప్రతి పోలీసు అధికారి, సిబ్బందిలో బాధ్యతను, ధైర్యాన్ని, సేవాభావాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు.

తమ కుటుంబ సభ్యులను ప్రజల రక్షణ కోసం కోల్పోయిన అమరవీరుల కుటుంబాల త్యాగం వెలకట్టలేనిదని, వారి బాధను పూర్తిగా తీర్చలేకపోయినా, వారి త్యాగాన్ని గౌరవించడం, వారికి అండగా నిలవడం సమాజం బాధ్యతని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేసి కాపాడిన ప్రజల భద్రతను నిరంతరం పరిరక్షిస్తూ, వారి ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి అని ఎస్పీ గారు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నిజాయితీ, అంకితభావం, మానవీయ దృక్పథంతో పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దేశ సరిహద్దు విధుల్లో ఉండగా చైనా దళాల దాడిలో అమరులైన పది మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది త్యాగాలకు గుర్తుగా నిర్వహించబడుతోంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజున నివాళులర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. పోలీసు విధులలో ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమిస్తూ ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసు సిబ్బంది సేవలు సమాజానికి ఎంతో విలువైనవని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసు అమరవీరుల వివరాలను జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ ఏ. శ్రీనివాసులు చదివి వినిపించారు. అమరులైన అధికారుల, సిబ్బంది పేర్లను స్మరించుకుంటూ పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు, శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తామని పునరంకితం అవుతోంది. అమరవీరుల త్యాగస్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, శాంతియుత సమాజ నిర్మాణానికి కృషి చేయడం ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతగా భావిస్తోంది.

ఈ కార్యక్రమంలో
తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ ఐఏఎస్.,మరియు అదనపు ఎస్పీలు శ్రీ శ్రీనివాసులు (పరిపాలన) శ్రీ రవి మనోహరాచారి (శాంతిభద్రతలు) శ్రీ ఐ రామకృష్ణ (తిరుమల) శ్రీ శ్రీనివాసరావు సాయుధ దళం మరియు పోలీస్ అధికారులు పోలీస్ అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు