జనసేనను తక్కువ చేస్తే సహించేది లేదు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..జనసేనను తక్కువ చేస్తే సహించేది లేదు

స్పష్టం చేసిన జనసేన పార్టీ నాయకులు

నాగాయలంక: అవనిగడ్డలో ఇటీవల జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాదుపై కొంతమంది టీడీపీ నాయకులు చేసిన విమర్శలను జనసేన పార్టీ నాగాయలంక మండల నాయకులు ఖండించారు. శనివారం నాగాయలంకలో జనసేన పార్టీ మండల నాయకులు బండ్రెడ్డి హరి, భోగాది శివ విష్ణు, మండలి ఉదయభాస్కర్ మాట్లాడుతూ టీడీపీ విస్తృత సమావేశంలో జనసేన పార్టీ బలం గురించి చర్చ అవసరమా? అని ప్రశ్నించారు. జనసేన పార్టీని తక్కువ చేసి మాట్లాడే అవసరం ఏమొచ్చిందన్నారు. జనసేన పార్టీపై, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదుపై మండల బాలవర్ధి, తలశిల స్వర్ణలత, మెండు లక్ష్మణరావు తదితరులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. 2014లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే 80 వేల ఓట్లు వచ్చాయని, 2019లో టీడీపీ విడిగా పోటీ చేస్తే 57 వేల ఓట్లు వచ్చాయని, 2024లో కలిసి పోటీ చేస్తే లక్షా 13వేల ఓట్లు వచ్చాయన్నారు. భుజాలపై మోసి గెలిపించామంటున్న బాలవర్ది 2024ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలో గెలిచిన ప్రతి టీడీపీ ఎమ్మెల్యేను నేటికీ భుజాలపై మోస్తున్న జనసేన నాయకుల కష్టం శ్రమ కనిపించలేదా అని ప్రశ్నించారు. జనసేన గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. జనసైనికులు ఆత్మాభిమానం తాకట్టుపెట్టే పరిస్థితి లేదన్నారు.

చంద్రబాబు అరెస్టు సమయంలో వైసీపీకి భయపడి గుమ్మం దాటని టీడీపీ నాయకులు అవసరం తీరాక ఏరు దాటాక బోడి మల్లన్న తరహాలో మాట్లాడటం సరికాదన్నారు. కూటమి ఏర్పాటు, ఎన్నికల్లో విజయంలో కీలకపాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి పని చేస్తుంటే, స్థానిక నాయకులు కవ్వించే వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదన్నారు.
ఇటీవల టీడీపీ నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ ఎక్కడా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఫోటోలు గాని, ప్రస్తావన గాని లేకుండా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఎన్నికల ముందు జనసేన కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి, జనసేన పార్టీ ఓట్లు కావాలి కానీ కూటమి ప్రభుత్వ విజయాలు ప్రజల దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నంలో జనసేన గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే సూచన మేరకు తామేక్కడా ఈ అంశంపై ఇప్పటివరకు విమర్శలు చేయలేదన్నారు. ప్రభుత్వ విజయాలు ప్రజల మధ్యకు తీసుకువెళ్లే కీలకమైన కార్యక్రమంలో జనసేనను కలుపుకోని టీడీపీ నాయకులు ఇటీవల రహదారులకు సాస్కి నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రికి పార్టీ పరంగా గ్రామాల్లో జన సైనికులు పాలాభిషేకాలు చేసుకుంటే దాన్ని విమర్శించడం సరికాదన్నారు.

బీసీ గ్రామాల్లో జనసేన బలాబలాల గురించి ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏ గ్రామంలో ఏ పార్టీకి ఎంత బలము ఉందో ఎంత పెరిగిందో మీరు ఎలా చెబుతారన్నారు. సుధీర్ఘ రాజకీయ చరిత్రలో ఏకఛత్రాధిపత్యంగా అధికారం చెలాయించిన అనేక పార్టీలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయని ప్రశ్నించారు. పార్టీల బలాబలాలు ప్రజల ఆలోచనలు బట్టి ప్రతి ఎన్నికలకు మారుతూ ఉంటాయని వాస్తవం తెలియదా అని ప్రశ్నించారు. సమన్వయ కమిటీలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలు బహిరంగ వేదికపై మాట్లాడటం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ వారికి ఎన్ని పదవులు తీసుకున్నారో గుర్తు లేదా అన్నారు. వేదికల మీద ఎమ్మెల్యే పక్కన టీడీపీ నాయకులు కూర్చున్నప్పటికీ పెద్దలు అనే గౌరవంతో తాము వెనుక ఉన్నామన్నారు. తమను పిల్లల పార్టీ అంటే తాము వారిని వృద్ధుల పార్టీ అనలేమా అని ప్రశ్నించారు. గత రెండున్నర ఏళ్లుగా అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అభివృద్ధి ప్రదాత, మంచివారు అని పొగిడిన నాయకులకు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి నియామకం తరువాత ఈ సమస్యలన్నీ వచ్చాయన్నారు. ఈ విమర్శలు చేయటం తెలిసి జరిగినా తెలియక జరిగినా ఈ ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంచార్జిపై ఉందన్నారు. తాము జన సైనికులుగా ఏనాడు ఎమ్మెల్యే మాట దాటి మాట్లాడబోమన్నారు. ఇకముందు జనసేన పార్టీని తమ ఎమ్మెల్యేను తక్కువ చేసి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని మిత్ర ధర్మం పాటించాలని కోరారు.