భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏలూరు పోరులో కూటమి ఐక్యతా శంఖారావం – కూటమి సమావేశంలో అంతర్గత విభేదాలు పరిష్కరించి కలిసికట్టుగా సాగాలని తీర్మానం..
ప్రజల్లోంచి ఎదిగిన నాయకుడు రెడ్డి అప్పలనాయుడు – సామాన్యుడిని మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు జిల్లా ఇంచార్జీ మంత్రి నాదెండ్ల మనోహర్ ధన్యవాదాలు..
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి – కూటమి అంటేనే త్యాగాలని, కూటమి అభ్యర్థుల గెలుపే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం..
ఈగోలకు తావులేదు – వన్‌సైడ్ విక్టరీయే లక్ష్యం – 2024 స్ఫూర్తితో 62 డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజాప్రతినిధుల పిలుపు..
ఏలూరు నగర సమగ్ర ప్రగతికి బాటలు – తాగునీరు, డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారంతో పాటు 22ఏ భూముల హక్కుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ.
ఏలూరు, అక్టోబర్ 19:- రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలన్నా, అన్ని జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా కూటమి ఐక్యతే బలమైన పునాది అని ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సంపూర్ణ సమన్వయం సాధించేందుకు ఏలూరులో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) , జనసేన నాయకులు నారా శేషు, బీజేపీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ సహా పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొని తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.

ఏలూరు కార్పొరేషన్ మేయర్ సహా అన్ని డివిజన్లలోనూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా, ఎలాంటి విభేదాలు లేకుండా ముందడుగు వేయాలని నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కూటమి నిర్ణయాల వెనుక విశాల ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. “రాజకీయాల్లో అందరికీ అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం చేస్తాం. కానీ ఏలూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఒక సామాన్యుడు, క్షేత్రస్థాయి నుంచి ప్రజా సమస్యలపై పోరాడుతూ ఎదిగిన రెడ్డి అప్పలనాయుడిని జనసేన నుంచి ఎంపిక చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అత్యంత అభినందనీయం, చారిత్రాత్మకం. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన అప్పలనాయుడిని కూటమి పక్షాలన్నీ ఆమోదించి నిలబెట్టాయి. ఈ ఎన్నికల్లో ఈగోలకు తావులేకుండా, కూటమి విజయమే పరమావధిగా అందరం పనిచేయాలి. గతంలో గంజాయి బ్యాచ్, అరాచక శక్తులు చేసిన నష్టాన్ని తిప్పికొట్టి, ఏలూరు నగరంలో పుష్కరాల నాటికి తాగునీరు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు ఇప్పటికే ప్రారంభించిన 22ఏ భూముల పరిష్కారం, ఎండోమెంట్ భూముల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తాం” అని మంత్రి వివరించారు..
అనంతరం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. “కూటమి అంటేనే త్యాగాలు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాగైతే నాయకులంతా త్యాగాలు చేసి నిలబడ్డారో, ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో అదే స్ఫూర్తిని చాటాలి. టీడీపీ, జనసేన, బీజేపీల్లో టికెట్లు ఆశించి రాని వారు ఎంతో కష్టపడిన మాట వాస్తవమే అయినా, వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ విజయం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అందరం గుర్తించాలి.