కోర్టుల్లో CC కెమెరాల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని: బడ్జెట్‌కు సంబంధం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కోర్టుల్లో CC కెమెరాల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని: బడ్జెట్‌కు సంబంధం లేదు -హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.
కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.. కోర్టుల్లో CC కెమెరాల ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుందనేది తమకు సంబంధం లేని విషయమని వ్యాఖ్యానించింది..
బడ్జెట్‌ కేటాయింపులతో సంబంధం లేకుండా సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాల్సిందేనని పేర్కొంది. ఈ విషయంలో తాము ఉత్తర్వులిచ్చే పరిస్థితి తీసుకురావద్దని ఘాటుగా వ్యాఖ్యానించింది…
రాష్ట్రంలో అమలు కావట్లేదంటూ..
CC కెమెరాల ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి ఏళ్ళు గడుస్తోందని హైకోర్టు గుర్తుచేసింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. అన్ని న్యాయస్థానాల్లో CC కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ 2024లో హైకోర్టులో పిల్‌ వేశారు. హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌ NV.సుమంత్‌ వాదనలు వినిపించారు..
ఆర్థికశాఖ వద్ద ఫైలు..
కెమెరాల విషయంలో అవసరమైన బడ్జెట్‌ విడుదల చేస్తూ ఈ ఏడాది జనవరి 12న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన కారణంగా నిధుల విడుదల విషయంలో తాజాగా జీవో జారీచేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది యతీంద్రదేవ్‌ వాదనలు వినిపిస్తూ నిధుల ఆమోదం కోసం ఫైలు ఆర్థికశాఖ వద్ద ఉందన్నారు. గతంలో నిధులు విడుదల చేశామని, అయితే ఆర్థిక సంవత్సరం ముగిసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే CC కెమెరాల ఏర్పాటుపై తాజా వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది…
దేశంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునళ్ళ లో ఆడియోతో కూడిన CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. పారదర్శకత, క్రమశిక్షణ, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది. కోర్టు హాల్‌ లో జడ్జీలకు ప్రైవసీ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ ఫుటేజ్ ద్వారా కేసుల జాప్యాన్ని తగ్గించవచ్చని, కోర్టులో అందరూ బాధ్యతగా వ్యవహరిస్తారని తెలిపింది..