భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని సర్కార్ లాక్కోవడం అన్యాయం: TUWJ
హైదరాబాద్: గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలాన్ని పోలీసులను, రెవెన్యూ అధికారులను పంపి సీజ్ చేయించడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది జె ఎన్ జె హౌసింగ్ సొసైటీ సభ్యులకోసం గతంలో నిజాంపేట లో 332 సర్వే నంబర్ లో కేటాయించిన 32 ఎకరాల స్థలంలో పోలీసుల పహారా మధ్య స్థలాన్ని స్వాధీన పరుచుకొని రెవెన్యూ అధికారులచేత ఏకంగా సీలు వేయించడం ఏంటని ఆ సంఘం అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు ప్రభుత్వాన్ని నిలదీశారు. 18 ఏళ్ల క్రితం కోట్లాది రూపాయలు చెల్లించిన సొసైటీ సభ్యులకు ఇప్పుడు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా జర్నలిస్టులకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు దక్కలేదని , పైగా గతంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జేఎన్ జె సొసైటీకి ఇచ్చిన నిజాంపేట స్థలాన్ని కూడా గురువారం రోజు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం జర్నలిస్టులను మోసం చేయడమే అన్నారు. నెల రోజుల ముందు రెవెన్యూ,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం,ఈ రోజు సి.ఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో డిసెంబర్ 9న ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ప్రకటన చేయడం చూస్తుంటే పరస్పర విరుద్ద ప్రకటనలతో జర్నలిస్టులను వంచిస్తున్నారని అన్నారు. ఇప్పటికే పలు మార్లు జర్నలిస్టులకు హామీ ఇచ్చిన సి.ఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఆ మాటను నిలబెట్టుకోక పోగా ఉన్న స్థలాన్ని లాక్కోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి ఉందన్నారు.వందల కోట్ల విలువ చేసే స్థలాన్ని సీజ్ చేసి ముందుగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిట్ చాట్ లో ప్రకటనలు చేయడం కాకుండా ఒక స్పష్టమైన విధాన ప్రకటన డాక్యుమెంట్ రూపంలో చేయాలని వారు డిమాండ్ చేశారు.అప్పుడే జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో నమ్ముతారని వారు స్పష్టం చేశారు.
