అర్నబ్’ తీవ్ర తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..‘అర్నబ్’ తీవ్ర తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • అక్టోబర్ 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం
  • గంటకు 115–125 కి.మీ. వేగంతో గాలులు.. గరిష్ఠంగా 140 కి.మీ. వరకు పెరిగే ప్రమాదం
  • ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు.. రైతులు పంటల సంరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
  • పంటల కంటే ప్రాణరక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి
  • వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారుల సూచనలు పాటించాలి
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, అక్టోబర్ 26: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు, రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు, పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పశ్చిమ మధ్య ప్రాంతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందన్నారు. అక్టోబర్ 26 అర్ధరాత్రికి తీవ్ర తుఫానుగా, 27న అత్యంత తీవ్ర తుఫానుగా బలపడి, 28వ తేదీ ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్–యానాం తీరాన్ని దాటే అవకాశముందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 140 కిలోమీటర్లకు చేరవచ్చని హెచ్చరించారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదమున్నందున అధికారులు జారీచేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే ముందుగానే సురక్షిత ప్రాంతాలు, పునరావాస శిబిరాలకు తరలివెళ్లాలని, అత్యవసర మందులు, తాగునీరు, పొడి ఆహారం, టార్చ్‌లైట్లు, బ్యాటరీలు, మొబైల్ ఛార్జర్లు, ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగలు, పెద్ద చెట్లు, బలహీన భవనాలు, హోర్డింగులు, నిర్మాణ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వరదనీటిలో మునిగిన విద్యుత్ పరికరాలను తాకవద్దని స్పష్టం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కలుషిత నీటిని వినియోగించకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలని, భారీ గాలులు, ఉరుములు, పిడుగుల సమయంలో బయటకు వెళ్లవద్దని కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలు తక్షణమే సురక్షిత తీరాలకు చేరుకోవాలని ఆదేశించారు. పడవలు, వలలు, ఇంజిన్లు, ఇతర సామగ్రిని భద్రపరచుకోవడంతో పాటు బీచ్‌లు, రేవులు, సముద్రపు గట్ల వద్దకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు.