ఆమె ఆదివాసీల గొంతు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఆమె ఆదివాసీల గొంతు..
పుట్టిన చోటు, పెరిగిన ప్రదేశం కొంతమందిపై చెరగని ముద్ర వేస్తుంది. అలా ముద్రపడిన సమూహంలో నుండి, తనపై పడిన గుర్తులను తుడిచేసుకుంటూ, సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించడం అంత ఆషామాషీ కాదు. అలాంటి ప్రాంతమే ఒరిస్సా మల్కాన్‌గిరి. ఎప్పుడూ మావోయిస్టు – పోలీసుల దాడులతో ఆ ప్రాంతం పేరు వార్తల్లో నిలుస్తుంది. అలాంటిచోట, ఆదివాసీ తెగలో పుట్టింది జయంతి బరుడా. పెరిగి పెద్దయ్యాక జర్నలిస్టు కావాలనుకుంది. ఆ దారిలో తను అందుకున్న ఉన్నత శిఖరాలు ఇప్పుడు ఆమెనే కాదు, ఆమె ఊరిని కూడా సగౌరవంగా నిలిపాయి.
ఆదివాసీ కోయ తెగకి చెందిన 35 ఏళ్ల జయంతి 11 మంది తోబుట్టువుల్లో ఒకరు. చిన్నతనంలో అడవిలో కట్టెలు, మహువా పూలు సేకరించడం, పశువుల పోషణ కోసం అమ్మతో వెళ్లడం జయంతికి బాగా గుర్తు. కొంచెం పెద్దయ్యాక చదువుకునేందుకు సర్కారు బడికి వెళ్లింది. ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్న ఆ స్కూల్లో పది మంది విద్యార్థులు పదో తరగతి వరకు చేరుకోవడం పెద్ద విశేషం. అంతకంటే మరో విశేషం అందరిలోకి అత్యధిక మార్కులతో జయంతి పదో తరగతి పాసవ్వడం.
జర్నలిజం నేర్చుకోవాలనుకున్నాను
పదో తరగతితో చదువుకు ముగింపు పలకాలని జయంత్రి ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేశారు. కానీ జయంతి వాళ్లని ఒప్పించింది. ‘మల్కాన్‌గిరి టౌన్‌లో కాలేజీకి వెళ్తూ, పక్కనే ఉన్న బస్తీ పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. అప్పుడే నాకు రెడ్‌ క్రాస్‌ సొసైటీ గురించి తెలిసింది. అక్కడ పేరు నమోదు చేసుకున్నాను. సోషల్‌ వర్క్‌లో భాగంగా ప్రభుత్వ అధికారులను కలిసేదాన్ని. కానీ అప్పుడు నాకు చాలా అవమానాలు ఎదురయ్యాయి. మహిళని, ఆపై నా తెగ, నా ప్రాంతం వారితో అలా మాట్లాడించింది. అయితే ఆ అధికారులు ఎంతో శ్రద్ధగా కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చూశాను. అప్పుడే నేను కూడా జర్నలిస్టు కావాలని నిర్ణయించుకున్నాను’ అని జయంతి తన గత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
విజయాల గురించి మాట్లాడాలని …
‘ఈ మనుషులు నాకు సమాధానాలు చెప్పాలంటే నేను జర్నలిజం చేయడం ఒక్కటే మార్గం. అలా చేస్తే నా మాటలకు విలువ ఉంటుంది. నాకు గౌరవం ఇస్తారు. నా ప్రశ్నలు వింటారు’ అని నిర్ణయించుకున్న జయంతి కోరాపూట్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో మాస్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ జర్నలిజంలో శిక్షణ తీసుకుని భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఛానెల్లో పనిచేశారు. అయితే అక్కడ తను సేకరించిన వార్తలను గుర్తించేవారు కాదు. ఛానెల్లో గిరిజనుల గురించిన వార్తలు వచ్చిన ప్రతిసారీ అవి ఆ ప్రాంత నిరక్షరాస్యత, పేదరికం గురించే ఉండేవి. ఈ పద్ధతినే జయంతి మార్చాలనుకుంది. ఆదివాసీలు అంటే తక్కువ కాదని, వాళ్లు సాధించిన విజయాల గురించి మాట్లాడుకోవాలని గట్టిగా అనుకుంది.
హైద్రాబాద్‌లో వందలాది మందిని కలిశాను
కోయ తెగలో మొట్టమొదటి జర్నలిస్టుగా జయంతి సాగిస్తున్న ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. తన ధైర్యం, తెగువ, కార్యసంకల్పం గురించి తెలిసిన స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు ఈసారి ఆమెకి తోడయ్యాయి. పికిల్‌ జార్‌ మీడియా సిఇఓ వాసంతి హరిప్రకాష్‌ ఆమెని నెట్‌వర్క్‌ ఉమెన్‌ ఇన్‌ మీడియా (ఎన్‌డబ్ల్యుఎంఐ)కి పరిచయం చేశారు. అప్పుడే జయంతి మొదటిసారి హైద్రాబాద్‌కి వచ్చారు. ‘మా ఇంటి నుండి నడుచుకుంటూ ఆటో స్టాండుకు చేరుకున్నాను. అక్కడి నుండి పక్కనే ఉన్న మరో గ్రామానికి వెళ్లాను. ఆ తరువాత బస్సులో వైజాగ్‌ చేరుకున్నాను. అక్కడి నుండి విమానంలో హైద్రాబాద్‌కి వచ్చాను. అక్కడ 500 మంది మహిళలను కలుసుకున్నాను. వారంతా దేశవ్యాప్తంగా మారుమూల పల్లెల నుండి వచ్చిన జర్నలిస్టులు. వాళ్లని కలుసుకున్నాక నా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది’