దీపావళి వేళ.. టపాసుల దుకాణాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..దీపావళి వేళ.. టపాసుల దుకాణాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు.. భద్రతా నిబంధనలు పాటించాలి

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

దీపావళి పండుగ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ గుంటూరు జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మంగళగిరి గ్రామీణ,తాడేపల్లి, నగరంపాలెం పోలీస్‌స్టేషన్ల పరిధిలోని టపాసుల హోల్‌సేల్, రిటైల్ దుకాణాలు, నిల్వ కేంద్రాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా టపాసుల విక్రయాలకు సంబంధించిన అనుమతులు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, టపాసుల నిల్వ, విక్రయాల సమయంలో పాటించాల్సిన నిబంధనలను అధికారులు పరిశీలించారు.పండుగ సమయంలో టపాసుల కొనుగోళ్లు, విక్రయాలు పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.టపాసుల దుకాణాల యజమానులు నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు నిర్వహించాలని, భద్రతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా టపాసుల విక్రయాలు చేపట్టడం, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దీపావళి పండుగను ప్రజలంతా సురక్షితంగా జరుపుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని దుకాణ యజమానులకు స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, నగరంపాలెం సీఐ రాజేష్, మంగళగిరి గ్రామీణ సీఐ చిరుమామిళ్ల వెంకట్, తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, ఆయా పోలీస్‌స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.