భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఏపీ స్థానిక ఎన్నికలు: ఎలక్షన్ వ్యయ పరిమితి ఖరారు, గైడ్‌లైన్స్ జారీ చేసిన ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయంపై పరిమితిని ప్రకటించింది.
ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు అభ్యర్థులు ఎంత ఖర్చు చేయాలో ఆ పరిమితిని ఖరారు చేస్తూ సంబంధిత మార్గదర్శకాలను వెలువరించింది. ఈ మేరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వారీగా పరిమితులను నిర్దేశించినట్టుగా SEC వెల్లడించింది.
ఖర్చు లిమిట్ దాటితే కఠిన చర్యలు..
రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు సభ్యుడు రూ.2 లక్షలు, మున్సిపాలిటీ వార్డు సభ్యుడు రూ.1.5 లక్షలు, నగర పంచాయతీ వార్డు సభ్యుడు లక్ష రూపాయలు మాత్రం ఖర్చు చేయాల్సి ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో నిలిచే అభ్యర్థులు ఈ రూల్స్‌కు లోబడే ఖర్చు చేయాలని ఎస్ఈసీ వెల్లడించింది. అభ్యర్థులు ప్రతి పైసాకు సంబంధించి లెక్కలను ఎన్నికల సంఘానికి అందించాలని కూడా స్పష్టం చేసింది. ఖర్చులని ప్రత్యేక అధికారుల టీమ్‌లు నిశితంగా పరిశీలిస్తాయని తెలియజేసింది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచే…

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందని, రిజల్ట్స్ ప్రకటన ముగిసేంత వరకు కొనసాగుతుందని ఎస్ఈసీ పేర్కొంది. ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. డబ్బు, మద్యం, గిఫ్ట్‌లు పంపిణీ చేయడం, బెదిరింపులకు పాల్పడటం, అధికార దుర్వినియోగానికి దిగడం వంటి వాటిపై నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. ఎలక్షన్ గైడ్‌లైన్స్‌ని ఉల్లంఘించే అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలపై చట్టపరంగా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను కమిషన్ ఆదేశించింది.