తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి

  • వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
  • దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో క్షేత్ర స్థాయి పర్యటన
  • ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ పనులు వేగవంతం చేయాలి
  • మత్స్యకారుల సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తా
  • కాకినాడ జిల్లాపై అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో వర్చువల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. తుపానులు వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక చర్యలు చేపట్టడం కాకుండా, తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి, తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తానని తెలిపారు. అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న సాయం తదితర అంశాలపై కాకినాడ జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో క్యాంపు కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, తీర ప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులతో తుపాను కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడకి సంబంధించి డిజైన్ రూపకల్పన, డీపీఆర్ తదితర పనులు వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కోనపాపపేట వరకు రక్షణ గోడ పొడిగింపు అంశంపై గతంలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థకు చేసిన ప్రతిపాదనలు త్వరితగతిన ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు పునరుద్ధరణకు తక్షణ చర్యలు
ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు తుపాను అలల తాకిడికి పూర్తిగా దెబ్బ తిన్న నేపథ్యంలో తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.
ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సత్వర ఉపశమనం
కాకినాడ జిల్లావ్యాప్తంగా 92 తీర ప్రాంత ఆవాసాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, 102 పునరావాస కేంద్రాల్లో వారందరికీ ఆశ్రయం కల్పించడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. సూరాడపేట, మాయాపట్నం, కొత్తపట్నం, నాయకర్ కాలనీల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే స్పందించి, 24 గంటల్లో నీటిని పూర్తిగా తొలగించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
తుపాను గాలుల కారణంగా పిఠాపురం నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ఉప ముఖ్యమంత్రివర్యులు తెలిపారు. తుపాను ప్రభావం తగ్గిన వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, భోగాపురం, నరసింగపురం, చిత్రాడ ఎస్సీ కాలనీ, మల్లం, విరవాడ మధ్య విద్యుత్ స్తంభాలు పడిపోయాయని వివరించారు. కొన్ని చోట్ల పునరుద్ధరణ తర్వాత వైర్లు కాలిపోయినట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించి, విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులకి స్పష్టం చేశారు.
నష్టం అంచనాలను త్వరగా పూర్తి చేయాలి
తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, బోట్లు, వలలు, మగ్గాలకు ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టాలపై సమగ్ర అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. రైతులు, మత్స్యకారులతో పాటు తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేలా నష్టపరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.