ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 388 కరువు మండలాలను గుర్తించిన ప్రభుత్వం

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 388 కరువు మండలాలను గుర్తించిన ప్రభుత్వం

నైరుతి రుతుపవన కాలం, ఖరీఫ్-2026 సీజన్లో ఏర్పడిన తీవ్ర వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

21 జిల్లాల్లో 283 చోట్ల తీవ్రం.. 105 మధ్యస్తం.. రాయలసీమలో ప్రభావ తీవ్రత ఎక్కువ

ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ.. ఉత్తరాంధ్రలో విజయనగరం, అనకాపల్లి

కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం

అమరావతి :

నైరుతి రుతుపవన కాలం, ఖరీఫ్-2026 సీజన్లో ఏర్పడిన తీవ్ర వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో 283 తీవ్ర, 105 మధ్యస్త కరువు మండలాలుగా వెల్లడించింది. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జి. సాయిప్రసాద్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. రాయలసీమతో పాటు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరువు ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయనగరం, అనకాపల్లిలోనూ ప్రభావం ఎక్కువగా ఉంది. కరువు నిర్ధారణకు ప్రామాణికాలు, కరువు నిర్వహణ మార్గదర్శకా ప్రకారం ఖరీఫ్ కరువును అక్టోబరు 31 నాటికి ప్రకటించాల్సి ఉంది. అయితే జూన్ నుంచి ఆగస్టు వరకు 53.4 శాతం వర్షపాత లోటు నమోదు కావడం, ఎల్నినో పరిస్థితులతో కరువు మండలాలను ముందుగానే ప్రకటించాలని కరువు నిర్ధారణ కమిటీ ప్రతిపాదించింది. ప్రతి మండలంలో కరువు తీవ్రతను నిర్ధారించడంలో మూడు ప్రధాన దశలను పరిగణనలోకి తీసుకున్నారు. వర్షపాత వ్యత్యాసం, వర్షం లేని రోజుల వ్యవధి, పంట విత్తిన విస్తీర్ణం, వృక్ష సంపద స్థితి, తేమ లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల లభ్యత ఆధారంగా కరువు మండలాలను నిర్ణయించారు. వరుసగా 3-4 వారాల పాటు తక్కువ వర్షపాతం నమోదు కావడాన్ని ప్రామాణికంగా తీసుకుని వీటిని నిర్దారించారు.