అర్నాబ్ తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తంగా

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……అర్నాబ్ తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి

ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలి

రిలీఫ్ కేంద్రాల్లో బాధితులకు భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు సహా అన్ని వసతులు కల్పించాలి

జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో పాటు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేయాలి

అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా, మచిలీపట్నం, అక్టోబర్ 25:

అర్నాబ్ తుఫాను నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లోని అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ తుఫాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ఆదివారం రాత్రి జిల్లా అధికారులతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శాఖలవారీగా చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, తుఫాను అనంతరం తక్షణమే చేపట్టాల్సిన సహాయక, పునరుద్ధరణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రిలీఫ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలి

తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితులలో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం అవసరమైన ప్రాంతాల్లో ముందుగానే రిలీఫ్ కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు. రిలీఫ్ కేంద్రాలకు చేరుకునే ప్రజలకు తాగునీరు, భోజనం, మరుగుదొడ్లు, నివాస వసతులు తదితర కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అవసరమైన సామగ్రి, ఇతర సదుపాయాలను ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు.

నిత్యావసర సరుకుల కొరత లేకుండా చర్యలు

పౌరసరఫరాల శాఖ అధికారులు తుఫాను సమయంలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో అవసరమైన నిత్యావసర సరుకుల నిల్వలను సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు, ప్రధాన గోదాముల నుంచి సరుకుల తరలింపు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సరుకుల పంపిణీకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.

డ్రైనేజీలు, సాగునీటి కాలువల్లో అడ్డంకులు తొలగించాలి

వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా పట్టణాలు, గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించి ఎక్కడైనా పూడిక, అడ్డంకులు ఉంటే తక్షణమే తొలగించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, నాచు, ఇతర వ్యర్థాలను తొలగించాలన్నారు. కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడితే నీరు జనావాసాల్లోకి చేరి ప్రజలకు, పంటలకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ముందస్తు ఏర్పాట్లు

తుఫాను సమయంలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ లైన్లు దెబ్బతినడం వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. దెబ్బతిన్న స్తంభాల స్థానంలో వెంటనే ఏర్పాటు చేసేందుకు అదనపు విద్యుత్ స్తంభాలు, అవసరమైన పరికరాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే మరమ్మతులు చేపట్టి సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.

రోడ్లపై అడ్డంకుల తొలగింపునకు యంత్రాలు సిద్ధం చేయాలి

పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల అధికారులు రహదారులపై చెట్లు కూలిపోవడం, ఇతర అడ్డంకులు ఏర్పడిన సందర్భాల్లో వెంటనే తొలగించేందుకు అవసరమైన జేసీబీలు, పవర్ సా యంత్రాలు, ఇతర పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తుఫాను అనంతరం రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారులను త్వరితగతిన పునరుద్ధరించేలా సిబ్బందితో సహా అవసరమైన వనరులను ముందుగానే సమకూర్చుకోవాలన్నారు.

టెలికాం సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు

టెలికాం ఆపరేటర్లు సెల్ టవర్ల నిర్వహణకు అవసరమైన డీజిల్ జనరేటర్లు, ఇంధనం, బ్యాకప్ విద్యుత్ సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పటికీ సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సేవలు వీలైనంత నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యవసర సమాచార మార్పిడి, సహాయక చర్యల సమన్వయానికి కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు.

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిస్థితులను బట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రుల వద్దకు లేదా సురక్షిత ప్రాంతాలకు పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

తుఫాను ప్రభావం ప్రారంభమయ్యే ముందే అవసరమైన వనరులు, యంత్రాలు, సిబ్బంది, సహాయక సామగ్రిని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తుఫాను సమయంలోనూ, అనంతరం సహాయక చర్యల్లోనూ ఎలాంటి జాప్యం జరగకుండా ప్రతి శాఖ తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు.

ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది.