భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 161 కొత్త పీజీ సీట్లు
రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 15 వైద్య విభాగాలకు కొత్తగా 161 పీజీ సీట్లను జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) మంజూరుచేసింది. ఆర్థోపెడిక్స్ లో అత్యధికంగా 27 సీట్లు మంజూరయ్యాయి. చర్మ, సుఖవ్యాధుల విభాగం, ఈఎన్టీ, పాథాలజీ విభాగాలకు 16 చొప్పున, రేడియో డయాగ్నసిస్ 14, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ విభాగాలకు 12 చొప్పున మంజూరయ్యాయి. జనరల్ మెడిసిన్, ఎనస్థీషియాలజీ, ఆఫ్తల్మాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్ విభాగాలకు ఎనిమిది చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్, ప్రసూతి-గైనకాలజీ, సైకియాట్రీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలకు నాలుగు చొప్పున మంజూరయ్యాయి. ప్రస్తుతం మంజూరైన 161 సీట్లను 2026-27 విద్యా సంవత్సరం పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటామని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. వైద్యశాలల్లో ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా బోధన సిబ్బంది నియామకాలు, పడకల పెంపు, వైద్య పరికరాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చొరవ చూపడంతో అదనపు సీట్ల మంజూరు సాధ్యమైందని పేర్కొన్నారు.
