భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..హెచ్ఐవీ వైరస్‌కి రక్షణ కవచమే లేకుండా చేసే సరికొత్త అస్త్రం, ఏడాదికి రెండు డోసులు చాలు!
ప్రపంచానికి అవసరమైన అత్యవసర మందులను చౌకగా అందించడంలో భారత ఔషధ రంగాన్ని “ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్” అని ఎందుకు అంటారో మరోసారి రుజువు అయింది.
క్లినికల్ ట్రయల్స్ (PURPOSE-1 స్టడీ) ప్రకారం, ముఖ్యంగా యువతుల్లో ఈ ఇంజెక్షన్ హెచ్ఐవీ సంక్రమణను 100% సమర్థవంతంగా నిరోధించినట్లు గతంలో రుజువైంది. ఆఫ్రికా లాంటి దేశాల్లో రోజువారీ మాత్రలు వేసుకునే స్వేచ్ఛ లేని మహిళలకు ఇది జీవరక్షక ఔషధంగా నిలుస్తుంది.
భారతీయ ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరిస్ తయారు చేసిన ‘లెనాకాపావిర్ (Lenacapavir)’ జెనరిక్ ఇంజెక్షన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) తాత్కాలిక అనుమతి ఇచ్చింది. హెచ్ఐవీ నివారణ రంగంలో ఇది ఒక విప్లవాత్మక పురోగతి. ఈ ఇంజెక్షన్‌ను ఏడాదికి కేవలం రెండు సార్లు అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అమెరికా అధ్యక్షుడి ‘ఎయిడ్స్ రిలీఫ్ ఎమర్జెన్సీ ప్లాన్’ (PEPFAR) కింద ఈ అనుమతి లభించింది. తక్కువ, మధ్యతరగతి ఆదాయ దేశాల్లో హెచ్ఐవీ నివారణ మందులను అందరికీ అందుబాటులోకి, తక్కువ ఖర్చులోకి తీసుకురావడానికి ఇది ఒక కీలక ముందడుగు.
కనీసం 35 కిలోల బరువుండి, లైంగిక సంబంధాల ద్వారా హెచ్ఐవీ సోకే ప్రమాదం ఉన్న పెద్దలు, కౌమారదశలో ఉన్నవారికి ఈ జెనరిక్ ఇంజెక్షన్‌ను వినియోగిస్తారు. అమెరికాకు చెందిన ‘గిలియడ్ సైన్సెస్ (Gilead Sciences)’ ఇచ్చిన వాలంటరీ లైసెన్స్ ఒప్పందం ప్రకారం, 120 దేశాల్లో ఒక్కో వ్యక్తికి ఏడాదికి దాదాపు 40 డాలర్లకే (సుమారు ₹3,300 – ₹3,500) ఈ మందును అందించనున్నారు. 2026 చివరి నాటికి మొదటి విడత స్టాక్ ఆయా దేశాలకు చేరుకుంటుందని, 2027 నాటికి విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని అంచనా.లెనాకాపావిర్ అంటే ఏమిటి? ఇది హెచ్ఐవీని ఎలా అడ్డుకుంటుంది?
లెనాకాపావిర్ అనేది దీర్ఘకాలం పనిచేసే ఒక యాంటీవైరల్ ఔషధం. దీనిని మొదట ‘గిలియడ్ సైన్సెస్’ అభివృద్ధి చేసింది. ఇది ‘హెచ్ఐవీ-1 క్యాప్సిడ్ ఇన్హిబిటర్స్’ అనే సరికొత్త ఔషధ వర్గానికి చెందింది. సాధారణంగా ప్రస్తుతం ఉన్న మందులు వైరస్ జీవిత చక్రంలో కేవలం ఒకే దశను టార్గెట్ చేస్తాయి. కానీ, లెనాకాపావిర్ హెచ్ఐవీ శరీరంలో వృద్ధి చెందకుండా, వ్యాపించకుండా బహుళ దశల్లో వైరస్‌ను అడ్డుకుంటుంది.
ఇది హెచ్ఐవీ చికిత్సకు, నివారణకు రెండింటికీ ఉపయోగపడుతుంది. నివారణ కోసం వాడేటప్పుడు ఏడాదికి రెండే ఇంజెక్షన్లు ఇస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా హెచ్ఐవీ నివారణ మార్గదర్శకాల్లో ఈ ట్వైస్-ఇయర్లీ (ఆరు నెలలకోసారి ఇచ్చే) ఇంజెక్షన్‌ను సిఫార్సు చేసింది. సైన్స్ రంగంలో దీని ప్రాముఖ్యతను గుర్తించిన ప్రఖ్యాత ‘సైన్స్ (Science)’ జర్నల్, దీనిని 2024 ‘బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్ (Breakthrough of the Year)’గా ఎంపిక చేసింది.అమెరికా FDA ఆమోదం ఎందుకు అంత ముఖ్యం?
ఈ ఆమోదం ద్వారా అర్హత కలిగిన దేశాలకు సరసమైన ధరలో జెనరిక్ మందులను వేగంగా సరఫరా చేయడానికి డాక్టర్ రెడ్డీస్‌కు మార్గం సుగమమైంది. అక్టోబర్ 2024లో గిలియడ్ సైన్సెస్ నుంచి డాక్టర్ రెడ్డీస్ వాలంటరీ లైసెన్స్ పొందింది. సెప్టెంబర్ 2025లో యునిటెయిడ్, విట్స్ ఆర్.హెచ్.ఐ, క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనిషియేటివ్ (CHAI)లతో కలిసి ఔషధ అభివృద్ధి, రెగ్యులేటరీ ప్రక్రియలు, గ్లోబల్ యాక్సెస్ కోసం భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి తనకు ఇంకా రాని వ్యాధిని నివారించడానికి రోజూ ఒక మాత్ర వేసుకోవడం మానసికంగా, ఆచరణాత్మకంగా చాలా కష్టమైన పని. కానీ, దాదాపు 100% సమర్థతతో పనిచేసే ఈ ఇంజెక్షన్‌ను ఏడాదికి రెండే సార్లు తీసుకోవాల్సి రావడం హెచ్ఐవీ నివారణ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పటికే ఆఫ్రికాలో 1,25,000 మందికి పైగా దీనిని వినియోగిస్తుండగా, జెనరిక్ అనుమతితో ఇది కోట్లాది మందికి అందుబాటులోకి రానుంది.
